మహిళలు ఆర్థికంగా ఎదగాలి : వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్​సూచించారు. మంగళవారం సిటీలోని టీటీడీసీలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలపై స్వయం సహాయక సంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను కేంద్ర బిందువుగా చేసుకొని మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాల అమలులో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమన్నారు. చదువు, నైపుణ్యం ఉండి ఊరులో సరైన ఉపాధి దొరకక, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా ఖర్చులకు భయపడి ఉపాధికి దూరమవుతున్న మహిళలకు మహాలక్ష్మి పథకంతో ఆ ఇబ్బంది తప్పుతుందని చెప్పారు. చేయూత కింద ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షలు పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని టీ హబ్ లో 115 రకాల పరీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, ఆర్టీసీ ఆర్ఎం సీహెచ్.వెంకన్న, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ బి.మాలతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుహాసిని, డీఆర్డీఏ ఏపీఎం, డీపీఎం, ఏసీలు తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

ఖమ్మం, వెలుగు : జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన కలెక్టరేట్‌ మీటింగ్​ హాల్​లో జాతీయ రహదారులు, ఇరిగేషన్‌, మూడవ రైల్వేలైన్‌ భూసేకరణ పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఇంకా పూర్తి చేయాల్సిన పనులు, పరిహారం చెల్లింపులు త్వరగా జరిగేలా చూడాలని చెప్పారు. సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్‌ ప్రాజెక్టు భూసేకరణ, కెనాల్‌ పనులు, రైతులకు పరిహారం చెల్లింపులను స్పీడప్​ చేయాలన్నారు.

మూడవ రైల్వేలైన్‌ భూసేకరణ, రైల్వే ఓవర్‌, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం కూడా త్వరగా కంప్లీట్​ చేయాలన్నారు.  సింగరేణి కాలరీస్‌ కంపెనీకి సంబంధించి రేజర్ల, కిష్టారం, ఎర్రగుంట గ్రామాలలో భూసేకరణ పూర్తి చేసి సింగరేణి సంస్థకు అప్పగించాలని చెప్పారు. సమావేశంలో ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారులు జి. గణేశ్, ఎస్‌.అశోక్‌ చక్రవర్తి, ఖమ్మం జాతీయ రహదారుల శాఖ  ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. దుర్గాప్రసాద్‌, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులు, రైల్వే శాఖ డిప్యూటీ సీఈ నాయుడు, రహదారులు, భవనాల శాఖ ఈఈ శ్యాంప్రసాద్‌, నేషనల్‌ హైవేస్‌ ఈఈ యుగందర్‌, సింగరేణి జనరల్‌ మేనేజర్‌ సాలెంరాజు, తహశీల్దార్లు, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్‌ బి. రంజిత్‌ కుమార్‌, నేషనల్‌ హైవేస్‌, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.