
వేములవాడ /నెట్‌వర్క్ , వెలుగు : మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు.. హర హర మహదేవా.. శంభో శంకరా.. నామస్మరణతో బుధవారం మార్మోగాయి. వేములవాడ రాజన్న ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాజన్నను దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 3 లక్షలకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అద్దాల మంటపంలో ఆలయ అర్చకులు మహాలింగార్చనను కన్నులపండువగా నిర్వహించారు. గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాకారుల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్, ఈవో వినోద్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జాతరలో ఇద్దరు భక్తులు అస్వస్థతకు గురికాగా జాతర రెస్యూ టీం సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. ఉమ్మడి జిల్లాలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పాతబజార్ గౌరీశంకర శివాలయంలో పూజలు చేశారు. అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణతో కలిసి ఎల్‌ఎండీ కాలనీలోని మృత్యుంజయ మహా దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని గిరిజా మృత్యుంజయ ఆలయంలో పూజలు చేశారు. సారంగాపూర్ మండలం పెంబట్ల-కోనాపూర్ గ్రామంలోని దుబ్బరాజరాజేశ్వర స్వామికి శివపార్వతుల కల్యాణం సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు.