
- నేడు రాజన్న ఆలయంలో శివరాత్రి జాగారాలు, పూజలు
- రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పేదల దేవుడిగా పిలవబడే రాజన్న దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పిల్లాపాపలతో జాతరకు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. నేడు రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాలు ఉండేందుకు భక్తులు చేరుకున్నారు. వీరంతా రాజన్న గుడి చెరువు ప్రదేశంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద బస చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, బస్సులు, విద్యుత్ దీపాలతో అలంకరణ, భక్తులకు త్వరగా దర్శనం కల్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వేములవాడ రాజన్నకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రికి, విప్‌కి స్వాగతం పలికారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చక బృందం సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శృంగేరి శారదా పీఠం తరఫున రాధాకృష్ణ శర్మ స్వామివారికి పట్టువస్త్రాలతో పాటు రుద్రాక్షమాలను సమర్పించారు. ఆలయ గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన శివర్చాన కార్యక్రమాన్ని మంత్రి, విప్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా.. పొన్నం
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మంత్రులందరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోడె మొక్కు వేములవాడలోనే ఉందన్నారు. రూ.76 కోట్లతో ఆలయ విస్తరిస్తున్నామన్నారు. మహాశివరాత్రి జాతర పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్‌మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు రవాణా, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అంతకుముందు రాజన్న భక్తులకు ఉచిత అల్పాహారాన్ని, వైశ్య సత్రం తరఫున అన్నదానంతో పాటు 14 ఉచిత బస్సులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అంతకుముందు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్ జాతర ఏర్పాట్లను పరిశీలించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఈఈ రాజేశ్, టౌన్ సీఐ వీరప్రసాద్ ఉన్నారు.
నేడు మహాలింగార్చన
శివరాత్రి సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అనువంశిక అర్చకులు మహాలింగార్చన, దర్శనం, రాత్రి 11.35 లింగోద్భవ కాలంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనాలనుకునేవారు భీమేశ్వరాలయంలో అభిషేకాలు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.