ఓం శివోహం భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి....కిక్కిరిసిన శివాలయాలు

ఓం శివోహం భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి....కిక్కిరిసిన శివాలయాలు

నెట్​వర్క్​, వెలుగు : మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉమ్మడి నల్గొండలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.  నల్గొండ జిల్లాలోని పానగల్ లోని పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం, బ్రహ్మంగారి గుట్ట, శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయాలకు  భక్తులు పోటెత్తారు.  జలాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి బిల్వ పత్రాలను  సమర్పించారు.   హాలియా, దేవరకొండ, చందపేట, చిట్యాల, కోదాడ, మేళ్లచెరువు, మఠంపల్లి, చండూరు ప్రాంతాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 

ఉదయం నుంచి సాయంత్రం వరకూ పూజల్లో పాల్గొన్నారు.  తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెంలోని స్వయంభూ   భక్త మార్కండేయ దేవాలయాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దర్శించుకున్నారు.   పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో  కలెక్టర్ ఇలా త్రిపాఠి  , జడ్జి ఎం నాగరాజు దర్శించుకున్నారు.  

ఆలయ అభివృద్ధికి తోడ్పడతా..

మేళ్లచెరువు శివాలయాన్ని అభివృద్ధి  చేయడం కోసం జాతరకు ఏటా కోటి రూపాయల ఫండ్స్ కేటాయిస్తున్నట్లు  మంత్రి ఉత్తమ్​  కుమార్ రెడ్డి అన్నారు.  బుధవారం ఆయన తన సతీమణి  ఎమ్మెల్యే పద్మావతితో  కలిసి  మేళ్లచెరువు  శివాలయంలో తొలి అభిషేక పూజల్లో  పాల్గొన్నారు.  రాజగోపురాల నిర్మాణానికి 50 లక్షల ఫండ్స్ ను,  భక్తుల అన్నదానం కోసం 25 లక్షల ఫండ్స్ ను కేటాయిస్తున్నట్లు  తెలిపారు.