అలంపూర్‌‌లో ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

అలంపూర్‌‌లో  ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి లైటింగ్, భక్తుల కోసం చలవ పందిళ్లు, చలివేంద్రం ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 20 వేల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్  వరణం, అఖండ దీప స్థాపన, మహా కలశ స్థాపన, రుద్రహోమం కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, భేరిపూజ, బలిహరణ, సాయంత్రం6 గంటలకు  ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు ఈవో పురేందర్  కుమార్  తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను తహసీల్దార్  మంజుల, మున్సిపల్  కమిషనర్  చంద్రశేఖర రావు, ఎస్సై వెంకటస్వామి, ఆలయ కమిటీ చైర్మన్  నాగేశ్వర్​రెడ్డి పరిశీలించారు. స్వామి, అమ్మవార్లను గద్వాల సంస్థానం వంశస్థులు శ్రీకృష్ణ రాంభూపాల్  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.