- వైభవంగా మహా లింగార్చన
- తరలివచ్చిన 2 లక్షల మంది భక్త జనం
వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారిని దర్శిచుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ర్ట, చత్తీస్‌గఢ్‌ల నుంచి సుమారు 2 లక్షల మంది తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. శివయ్యను దర్శించుకోవడానికి గంటల సమయం పట్టింది. -కోడె మొక్కుల కోసం భక్తులు బారులు దీరారు. ఆలయ అద్దాల మంటపంలో మహాలింగార్చనను దాదాపు రెండు గంటల పాటు కన్నులపండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు జాగారం చేశారు.
ఆలయ పరిసరాల్లో రాజన్న గుడి చెరువు మట్టితో శివలింగాలు, ప్రమిదలు తయారు చేసి దీపాలు వెలిగించారు. శివస్వాములు మాల విరమణ చేశారు. అంతకుముందు పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు.రాత్రి గం.11-.35 గంటలకు లింగోద్భవ సమయంలో 11 మంది రుత్విజులు, వేద పండితులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన ‘శివార్చన’ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, హైకోర్టు జడ్జి కె సురేందర్, జిల్లా, స్థానిక జడ్జీలు కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్‌మహాజన్, ఈవో కృష్ణ ప్రసాద్ ఏర్పాట్లను
పర్యవేక్షించారు.