Maha Shivratri 2025: శివరాత్రి,మహా శివరాత్రి మధ్య తేడా ఏంటీ..ఈ పర్విదినాల్లో భక్తుల నమ్మకాలు

Maha Shivratri 2025: శివరాత్రి,మహా శివరాత్రి మధ్య తేడా ఏంటీ..ఈ పర్విదినాల్లో భక్తుల నమ్మకాలు

శివరాత్రి అనగానే ఉపవాసం, జాగారాలు, ప్రతి ఇళ్లు,ఆలయాలు శివనామస్మరణలతో మార్మోగిపోతాయి.భక్తి శ్రద్దలతో శివపార్వతులను పూజిస్తారు. ప్రతియేటా ఫిబ్ర వరి లేదా మార్చినెలల్లో ఈ పవిత్ర శివరాత్రి మహోత్సవాలను చతుర్ధశి కృష్ణపక్షం రోజున ఇష్టదైవం శివున్ని ఆరాధిస్తుంటారు. ఈ రోజు శివునికి అంకితమైన రోజుగా భక్తులు భావిస్తారు. అందుకే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.  ప్రతియేటా భారతదేశం అంతటా మాఘ, ఫాల్గుణ మాసాలలో కృష్ణ పక్ష చతుర్దశి తిథి ఈ పర్వదినాన్ని జరుపు కుంటారు. దక్షిణ భారత క్యాలెండర్ ప్రకారం.. ఈ పండుగ మాఘ మాసంలో వస్తుంది.ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ ఫాల్గుణ మాసంలో వస్తుంది.

ఈ సంవత్సరం మహా శివరాత్రి బుధవారం(ఫిబ్రవరి 26, 2025న) వచ్చింది. మహా శివరాత్రికి సంబంధించిన చతుర్దశి తిథి ఫిబ్రవరి 26న ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 27న ఉదయం 08:54 గంటలకు ముగుస్తుంది. నిషిత కాల పూజ సమయం ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 12:27 నుండి 01:16 వరకు ఉంటుంది. అయితే  ప్రతినెలా శివరాత్రి కూడా జరుపుకుంటారు. శివరాత్రి, మహా శివరాత్రి మధ్య చాలా మందికి గందరగోళం ఉంది. రెండు పండుగల మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. 

శివరాత్రి అంటే..

దీనిని మాసిక శివరాత్రి అని కూడా పిలుస్తారు. కృష్ణ పక్ష చతుర్దశి నాడు వస్తుంది. ప్రతి సంవత్సరం 12 శివరాత్రులు వస్తాయి. శివుని భక్తులకు ఇది చాలా ముఖ్యమైనది. శివరాత్రి నాడు ప్రజలు ఉపవాసం ఉంటారు. ప్రార్థిస్తారు. శివుడికోసం ధ్యానం చేస్తారు.

మహా శివరాత్రి అంటే 

ప్రతి నెలా ఒకసారి వచ్చే శివరాత్రిలా కాకుండా, మహా శివరాత్రి ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇది సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. మహా శివరాత్రి గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. మహా శివరాత్రి రాత్రి, శివుడు సృష్టి, సంరక్షణ, విధ్వంసం చక్రాన్ని సూచించే విశ్వ నృత్యాన్ని ప్రదర్శిస్తాడని కొందరు నమ్ముతారు. మరికొందరు ఇది శివపార్వతులు ఐక్యత పొందిన రాత్రి అని నమ్ముతారు.

మహాశివరాత్రి విషయంలో మరో నమ్మకం కూడా ఉంది. మహా శివరాత్రి రోజున గ్రహం ఉత్తర అర్ధగోళం మానవునిలో సహజంగా శక్తి ఉప్పొంగే విధంగా ఉంచబడిన రాత్రిగా కూడా పరిగణిస్తారు.