ముంబై: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాయుతి కూటమి ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాలిదాస్ కోలాంబ్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎమ్మెల్యేలు మాత్రం ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ వాకౌట్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.
మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తొలి రోజు మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదన్నారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ స్టేట్ చీఫ్ అబు అసిం అజ్మీ, ఆ పార్టీ సీనియర్ నేత రయీస్ షేక్ మాత్రం ఎంవీఏ పిలుపును పట్టించుకోలేదు. ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా.. మూడు రోజుల పాటు స్పెషల్ అసెంబ్లీ సెషన్ నిర్వహించారు.
‘జైశ్రీరామ్’.. ‘జై భవానీ’.. ‘జై శివాజీ’ నినాదాలు
సభ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారానికి ముందు.. చైన్సుఖ్ సచేతి (బీజేపీ), జయ్‌కుమార్ రావల్ (బీజేపీ), మాణిక్‌రావు కొకాటే (ఎన్సీపీ), ఆశీశ్ జైశ్వాల్ (శివసేన)ను ప్రొటెం స్పీకర్ ప్యానెల్ సభ్యులుగా గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన సీఎం ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేగా ప్రొటెం స్పీకర్ కాలిదాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఫడ్నవీస్ తొలిసారి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఆరో సారి ప్రమాణం చేశారు. ఫడ్నవీస్ ప్రమాణం చేసేటప్పుడు మహాయుతి కూటమి ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ ‘జైశ్రీరామ్’.. ‘జై భవానీ’.. ‘జై శివాజీ’ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
ఈవీఎంల విషయంలో తప్పు జరిగింది: ఆదిత్య థాక్రే
ఈవీఎంలపై తమకు అనేక అనుమానాలున్నాయని, అందుకు నిరసనగా తొలిరోజు ప్రమాణస్వీకారం చేయలేదని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రే ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈవీఎంలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఎన్నికల ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంలలో తప్పు జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించట్లేదు’’ అని ఆదిత్య థాక్రే అన్నారు. మహాయుతి విజయం.. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నేత నానా పటోలే, ఎన్సీపీ నేత జితేంద్ర మండిపడ్డారు.
కోర్టుకెళ్లండి: అజిత్ పవార్
ప్రతిపక్షాలు.. తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమర్శించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని బాయ్‌కాట్ చేయడం సరికాదన్నారు. ‘‘గెలిస్తే ఈవీఎంలు బాగున్నయ్.. ఓడిపోతే బాగాలేవని అంటారా? ఈవీఎంలపై మీకు ఏమైనా అనుమానాలుంటే ఎలక్షన్ కమిషన్, కోర్టుకు వెళ్లండి. తగిన ఆధారాలు సమర్పించండి’’ అని అజిత్ పవార్ సూచించారు. మహా వికాస్ అఘాడీ సభ్యులు కూడా కొన్ని చోట్ల గెలిచారని, అక్కడి ఈవీఎంలను ఎందుకు తప్పుబట్టడం లేదని ప్రశ్నించారు.