మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలోనే కుసుమ దీక్షిత్ రెడ్డి (9)
మహబూబాబాద్: బాలుడు దీక్షిత్ కిడ్నాప్ పై మిస్టరీ వీడడం లేదు. గత మూడు రోజులుగా బాలుడు కిడ్నాపర్ల చెరలోనే ఉండడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో బాలుడి తల్లికి కిడ్నాపర్ మరోసారి ఫోన్ చేసి 45 లక్షలు రెడీ చేసుకోవాలని చెప్పాడు. ఎక్కడికి తీసుకురావాలో ఇవాళ చెప్తానన్నాడు. తమ వద్ద అంత డబ్బులేదని.. ఎంతో కొంత మొత్తం అరెంజ్ చేస్తామని.. బాలుడు దీక్షిత్ కు ఎలాంటి హాని తలపెట్టవద్దని తల్లి వేడుకుంది. డబ్బు అరెంజ్ చేయాల్సిందేనని కిడ్నాపర్ ఫోన్ కట్ చేసేశాడు. కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు సవాల్ గా మారింది. బాలుడి తండ్రి జర్నలిస్ట్ కావడంతో డీజీపీ దృష్టికి తీసుకెళ్లాయి జర్నలిస్ట్ సంఘాలు. కిడ్నాప్ వ్యవహారంపై ఆరా తీసిన డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. తల్లిదండ్రులు.. బంధువుల అనుమానం మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినా కేసులో ఏమాత్రం పురోగతి కనిపించలేదు. బాలుడి బాబాయ్ మనోజ్ తోపాటు.. మరికొందరు ఇంజనీరింగ్ విద్యార్థులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐటీకోర్, టాస్క్ ఫోర్స్, ఇంటలిజెన్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని కిడ్నాపర్ల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడిని సురక్షితంగా విడిపించడమే టార్గెట్ గా పెట్టుకుని ప్రత్యేక దృష్టి సారించారు. తమ చిన్నారి మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలోనే ఉండడంతో బాలుడి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.