నాలుగు వేల ఏళ్ల క్రితం జరిగిన మహాభారత ఇతిహాసంపై కథనం

మహాభారతాన్ని రాయడం పూర్తి చేశాక… ‘దీనిలో ఉన్నది ఎక్కడైనా ఉంది. దీనిలో లేనిది మరెక్కడా ఉండే వీలు లేదు’ అని వ్యాసుడు ప్రకటించాడు. అంటే, ప్రపంచంలోని అన్ని స్వభావాల సారాంశమే మహా భారతం. వేల ఏళ్లు గడుస్తున్నా కాలానికి నిలిచి ఉంది. భారత కాలంపై ఇప్పటివరకు అనేక అనుమానాలుండేవి. తాజాగా క్రీస్తుపూర్వం రెండు వేల ఏళ్లనాటి రాగి యుగానికి చెందినదిగా కనుగొన్నారు.  దాదాపు నాలుగు వేల ఏళ్ల క్రితం జరిగిన మహాభారత ఇతిహాసంపై ఆర్కియాలజిస్టులు కొత్త ఫోకస్​ పెంచారు.

మహా భారతాన్ని ‘ఇతిహాసం’ అంటారు. అంటే, ‘ఇతి’ అంటే ఈ విధంగా, ‘హా+ అస’ అంటే -జరిగిందట అని చెప్పేది. పూర్వ కాలంలో ఏ కథ ఎలా జరిగిందో దానిని ఉన్నదున్నట్టుగా చెప్పేది ఇతిహాసం. మహా భారతాన్ని కేవలం పురాణంగా భావించవద్దని, అనేకానేక చారిత్రక ఆధారాలతో ఉన్నదని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తేల్చాయి. తాజాగా ఆర్కియలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్​ఐ) వారి రీసెర్చ్​లో మహాభారతం క్రీస్తు పూర్వం 2000–1500 మధ్య కాలంలో జరిగిందని కన్​ఫర్మ్​ చేసింది. గతంలో 1951–52 ప్రాంతాల్లో హస్తినాపురం, ఇంద్రప్రస్త ఏరియాల్లో జరిపిన తవ్వకాలనుబట్టి ప్రముఖ ఆర్కియాలజిస్ట్​ బి.బి.లాల్​ ఈ కాలాన్ని క్రీస్తు పూర్వం 1000–900 ఏళ్లుగా గుర్తించినప్పటికీ… తాజా పరిశోధనల్లో అంతకు పూర్వమే కౌరవ–పాండవుల చరిత్ర ఉందని తేలింది.

నాటి హస్తినాపురంగా చెప్పుకునే నేటి ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని సనౌలి ప్రాంతంలో మూడు నెలలపాటు ఏఎస్​ఐ తవ్వకాలు జరిపింది. కురుక్షేత్ర యుద్ధంలో వాడినట్లుగా చెబుతున్న రథాలు, విల్లు వంటివన్నీ ఈ తవ్వకాల్లో బయటపడ్డాయని ఏఎస్​ఐ డైరెక్టర్​ సంజయ్​ మంజుల్​ వెల్లడించారు. ఏఎస్​ఐ కనుగొన్న తాజా విశేషాల్లో గుర్రాలు లాగిన రథం, వాటిని అదిలించడానికి వాడిన కొరడా, తుప్పుపట్టిపోయిన విల్లు, బాణాలు, కవచాలు, కిరీటాలు, కత్తులు వంటి యుద్ధ సామగ్రి ఉంది. అలాగే, ఆ ప్రాంతంలో ఒక స్మశానాన్నికూడా గుర్తించారు. పరిసరాల్లోనే అప్పటి కుండలు, దివిటీలు ఉన్నాయి. ఇవన్నీ మహాభారతంలో చెప్పిన ఆనవాళ్లకు సరిపోలతాయన్నారు. ‘మా తవ్వకాల్లో దొరికిన కొరడా గుర్రాలను అదిలించడానికి వాడేదే. దీనిని ఎద్దుల్ని కొట్టడానికి వాడరు. గుర్రాలను రథానికి లింక్​ చేసే కాడి మొద్దు, ఇరుసు, దివిటీలు పెట్టుకునే పోల్​ వంటివి రాగి తొడుగులతో చెక్కుచెదరకుండా ఉన్నాయి. రుగ్వేద కాలానికి, ఆధునిక నాగరికతకు మధ్య తెగిపోయిన లింక్​ని సనౌలి తవ్వకాలు పూరిస్తున్నాయి. రుగ్వేదం కాలంలోనూ, రామాయణ, మహాభారత కాలంలోనూ వాడినట్లు చెబుతున్న రథాలకు పోలిక దొరికింది’ అన్నారు మంజుల్​.

అంతేకాకుండా, కురు వంశపు రాజుల చరిత్రను ఒక వరుసలోకి తెచ్చే ప్రయత్నం చేశారు మంజుల్.  ప్రతీపుడి తర్వాత అయిదోవాడు ధృతరాష్ట్రుడు, ఆరోవాడు పాండు రాజు, ఏడో రాజు ధర్మరాజు అని, ఈ వంశంలోని 36వ రాజు క్షేమకుడు అని గుర్తించారు. మంజుల్​కూడా బుద్ధుడి కాలానికి కురు వంశపు రాజులకు లింక్​ కలిపినప్పటికీ… బి.బి.లాల్​ మాదిరిగా ఒక్కొక్కరి పాలనాకాలాన్ని 15 ఏళ్లుగా కాకుండా 50 ఏళ్లుగా చెబుతున్నారు.  ఆ ప్రకారంగా చూసిప్పుడు 2000–1500 మధ్య కాలంలో మహాభారతం జరిగిందన్నది మంజుల్​ అంచనా. సనౌలి ఏరియాలో దొరికిన రాగి తొడుగులు, కవచాలు వంటివి ఓచ్రే కలర్డ్​ పొటరీ కల్చర్​ (ఓసీపీ)కి చెందినవిగా చెబుతున్నారు. రాగి వాడకం క్రీస్తు పూర్వం 2600–1700 మధ్యకాలంలో జరిగింది. ఇది హరప్పా నాగరికత (క్రీ.పూ.2000–2500)కు దగ్గరగా ఉండే కాలం. అప్పట్లో వెల్లివిరిసిన నగర నాగరికతలో పదునైన ఆయుధాలు, డాగర్లు, కవచాలు, రథాలు, రాగి పాత్రలు వంటివి వాడేవారు. ఇవన్నీ మహాభారత కాలంలో చెబుతున్న వైదిక కర్మకాండకు దగ్గరగా ఉన్నాయి. మీరట్​ సహా మహాభారతానికి చెందిన అనేకచోట్ల వీటిని కనుగొన్నారు. అయితే, లాల్​ టీమ్​ చెబుతున్న పెయింటెడ్​ గ్రే వేర్​ (పీజీడబ్ల్యు) వాడకమనేది గ్రామీణ నాగరికతకు చెందినది. ఆ సమయం (క్రీ.పూ.1200–600)లో రథాలుగానీ, విరివిగా వైదిక కర్మకాండలు జరపడంగానీ, పాత్ర సామగ్రిని ఎక్కువగా వాడుకోవడంగానీ జరగలేదు. పైగా, పీజీడబ్ల్యు కాలంలోని ఆధారాలేవీ మహాభారతంలో చెప్పిన అంశాలతో సరిపోలడం లేదంటున్నారు మంజుల్​. ఓసీపీ కల్చర్​ (రాగి వాడకం) ఎగువ గంగానదీ లోయ ప్రాంతంలో బాగా విస్తరించింది. ఆ సమయంలోనే వరి, బార్లీ, చిరుధాన్యాలు పండించడం, పశువులు, మేకలు, గొర్రెలు, పందులు, కుక్కలు వంటి వాటిని ఇళ్లల్లో పెంచడం, రాగి నగలు ధరించడం మొదలైనవన్నీ చోటు చేసుకున్నాయి. మహాభారత ఇతిహాసంలో చెప్పిన అనేక అంశాలకు ఈ కల్చర్​లోని ఆధారాలు దగ్గరగా ఉన్నాయి.

సనౌలి ప్రాంతంలో మంజుల్​ టీమ్​ జరిపిన తవ్వకాలకోసం ఆధునిక పరికరాలను వినియోగించారు. ఎక్స్​రే, స్కాన్​, 3డీ స్కానింగ్​, ఫొటోగ్రామెట్రీ, జీపీఆర్​ సర్వే వంటి పరికరాలతో కచ్చితమైన ఫలితం వచ్చేలా శ్రమించారు. 1950లో లాల్​ టీమ్​ జరిపిన తవ్వకాల తర్వాత కనీసం 8 చోట్ల గాలింపు జరిగింది. ఇవన్నీ మహాభారతంలో పేర్కొన్న ప్రాంతాల్లో జరిపిన తవ్వకాలే. ఇంకా తవ్వకాల దశలోనే ఉన్నందువల్ల చారిత్రక నిర్ధారణకు ఏఎస్​ఐ ఇంకా రావడం లేదు.

భారతం గొప్పదనమేమిటంటే…

మహాభారతాన్ని నన్నయ చాలా గొప్పగా వర్ణించాడు. దీనిని ఏ వర్గానికి చెందినవారు చదివితే అది వాళ్లకే చెందినదిగా భావిస్తారని అని ఈ కింది శ్లోకంలో చెబుతాడు.

‘ధర్మ శాస్త్రజ్ఞులు ధర్మ శాస్త్రంబని – యధ్యాత్మ విదులు వేదాంతమనియు

నీతి విచక్షుణుల్ నీతి శాస్త్రంబని – కవి వృషభులు మహా కావ్యమనియు

లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని – యైతిహాసకు లితిహాసమనియు

బరం పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ -యంబని మహి కొనియాడుచుండ’ అంటాడు.

భారతాన్ని మన తెలుగువాళ్లు ‘తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి’ అంటారు. గారెకు ప్రత్యేకించిన రుచి లేదు. దానిని పచ్చడితో, పొడితో ఎలాగైనా తినవచ్చు. పెరుగులో, సాంబారులో సైతం నానబెట్టి తినవచ్చు. ఏ పదార్థంతో కలిస్తే దాని పేరును, రుచిని సొంతం చేసుకున్నట్లే… భారతం కూడా పండితులు, కవులు, హిస్టారియన్లు ఎవరైనా తమ తమ యాంగిల్​లో దానిని విశ్లేషించుకోవడానికి తగినంత సమాచారం ఉందని చెబుతుంటారు.

లాల్​ పరిశోధనలకు ఆధారమేమిటి?

ఇంద్రప్రస్త, హస్తినాపురం ఏరియాల్లో బి.బి.లాల్​ పరిశోధనల్లో ఏం చెప్పారంటే… గంగా నదిలో వచ్చిన భారీ వరదల్లో ఈ ప్రాంతం కొట్టుకుపోయింది. అక్కడ దొరికిన అవశేషాల్ని పరిశీలిస్తే అప్పటివారంతా పెయింటెడ్​ గ్రే వేర్​ (పీజీడబ్ల్యు) వాడేవారు. అంటే క్రీస్తు పూర్వం 1200 నుంచి 600 ఏళ్ల మధ్యకాలంలో పశ్చిమ గంగా తీరం, ఘగ్గర్​–హక్రా లోయ ప్రాంతంలోని ఇనుప యుగానికి చెందిన పాత్రలు వాడేవారు. ఇది హరప్పా నాగరికతకు తర్వాతి కాలంగా ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. హస్తినాపురం, మథుర, కురుక్షేత్రం, కాంపిల్య ప్రాంతంలోని దొరికిన పొటరీ (మట్టి పాత్రలు)తో పోలి ఉన్నాయి. లాల్​ పరిశోధనల ప్రకారం.. కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 800 దరిదాపుల్లో జరిగింది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన పరీక్షిత్తు మహారాజు (అభిమన్యుడి కొడుకు) హస్తినాపురంలోనే పాలన సాగించాడు. ఆయనకు అయిదో తరం వాడైన నిచాస్కుడు తన రాజధానిని కౌశంబికి మార్చుకున్నాడు.  బుద్ధుడి కాలానికి చెందిన ఉదయన మహారాజు (కురు వంశంలోని 19వ తరం) ఈ ప్రాంతం నుంచే క్రీస్తు పూర్వం 500ల్లో పరిపాలించాడు. ఇంకా… ఉదయనుడి తర్వాత ఒక్కొక్కరు 15 ఏళ్ల చొప్పున మొత్తంగా 24 మంది కురు వంశపు రాజులు ఇక్కడ పాలన సాగించారు. ఈ ఆధారాలన్నిటిని బట్టి మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 1000–900 ఏళ్లుగా బి.బి.లాల్​ నిర్ధారించారు.

మహాభారతం కథనాలపై ఉన్న అనుమానాలు తక్కువేమీ కావు. అయితే, 18 పర్వాలతో లక్షకు పైగా శ్లోకాలతో వ్యాసుడు మహాభారతాన్ని రచించాడన్నది అందరూ అంగీకరిస్తున్న విషయం. ఆ మొత్తం సారాన్ని 21 వేల పద్యాలలోకి కుదించి కవిత్రయం (నన్నయ, తిక్కన, ఎర్రన) తెలుగులో రాసింది. దీనినే తెలుగులో మొట్టమొదటి కావ్యంగా గుర్తించారు. మహాభారతం ‘ఇతిహాసం (ఈ విధంగా జరిగింది)’ అనడానికి అనేక ప్రామాణికాల్ని హిస్టారియన్లు చూపిస్తున్నారు.

భారత గాథలో యాభై మందికి పైగా కురు రాజుల వంశావళి సాగుతుంది. ఇది ఫిక్షన్​అయినట్లయితే ఇంతమంది రాజుల అవసరం ఉండదు. నలుగురైదుగురితో కథ నడిపించేయవచ్చు. కానీ, ఆది పర్వంలోని 62వ అధ్యాయం కురు రాజుల వివరాలను అందించింది.

మహాభారతంతో ముడిపడినవిగా 35 ప్రాంతాలను ఏఎస్​ఐ గుర్తించింది. అక్కడ దొరికిన రాగి పాత్రలు, ఇనుము, రాజముద్రలు, టెర్రాకోట పాత్రలు వంటివి అతి పురాతనమైనవిగా నిర్ధారించుకుంది.

రామాయణం త్రేతాయుగం నాటిది కాగా, ఆ తర్వాతదైన ద్వాపర యుగానికి చెందింది మహాభారతం. రామాయణాన్ని వాల్మీకి, భారతాన్ని వ్యాసుడు రాశారు. రెండు వేర్వేరు కాలాలకు చెందిన ఇతిహాసాలను, వేర్వేరు వ్యక్తులు రాసినప్పటికీ… ప్రాంతాలు, రాజవంశాలు, యుద్ధ రీతులు వగైరాల్లో అనేక పోలికలు కనిపిస్తాయి.

యాదవ రాజైన కృష్ణుడి వంశంలోని 138వ రాజుగా చంద్రగుప్త మౌర్యుడిని గ్రీక్​ హిస్టారియన్​ మెగస్తనీస్​ పేర్కొన్నారు. చంద్రగుప్తుడు క్రీ.పూ. 322–298 కాలానికి చెందినవాడు.

కృష్ణుడు రాయబారంకోసం హస్తినాపురానికి కార్తీక మాసం పౌర్ణమినాడు రేవతి నక్షత్ర ముహూర్తంలో బయలుదేరాడని ఉద్యోగ పర్వం చెబుతోంది. దారిలో బృకస్థల వద్ద భరణీ నక్షత్రంలో రెస్ట్​ తీసుకున్నాడని, రాయబారం ఫెయిలైన రోజున పుష్యమి నక్షత్రం ఉందని ఆ పర్వంలో వివరాలున్నాయి. రేవతికి భరణికి మధ్య ఒకరోజు, భరణికి పుష్యమికి మధ్య అయిదు రోజులు గ్యాప్​ ఉంటుంది.

హస్తినాపురం నుంచి కృష్ణుడు వెళ్లేటప్పుడు కర్ణుడు కొంతదూరం సాగనంపుతాడు. ఆ రోజున ఉత్తర నక్షత్రం ఉంది. ఆ సమయంలో ఆకాశంలో గ్రహాల పొజిషన్​ని చూసి కర్ణుడు చాలా ఆందోళన చెందుతాడు. రానున్నది చాలా చేటు కాలమని, తీవ్ర రక్తపాతానికి, అపారమైన ప్రాణనష్టానికి ఇదొక సూచనని కృష్ణుడితో అంటాడు. కర్ణుడు చూసిన గ్రహాల పొజిషన్​ని ఉద్యోగ పర్వంలో వ్యాసుడు 16 శ్లోకాలలో వివరించాడు.

దుష్యంతుడు, శకుంతల కొడుకు భరతుడి పేరు మీద భారత దేశంగా పిలుస్తారని చెబుతారు. భారతం ఫిక్షన్​ కాదనడానికి ఇదొక ఉదాహరణగా చెబుతారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక నవలలోని హీరో పేరు మీద దేశం ఏర్పడలేదు.

యూరోపియన్​ ప్రాంతానికి చెందిన సంచార ఆర్యన్​ తెగలు క్రీ.పూ.1500 తర్వాత ఇక్కడికి వచ్చాయి. వీరు సంస్కృత భాషను రూపొందించి, నాలెడ్జి పెంచుకుని, ఇంత భారీ రచనను చేయడం అసాధ్యమని బాలగంగాధర్​ తిలక్​, అరవిందుడు, దయానంద సరస్వతి వంటివాళ్లు కొట్టిపారేశారు.

పొయెటిక్​ నేచర్​తో ఉన్నందువల్ల భారతాన్ని ఫిక్షన్​గా చెప్పడం హాస్యాస్పదమని, మ్యాథమెటిక్​ ఫార్ములా సహా దేన్నయినా కవితాత్మక పద్ధతిలోనే రాస్తారని పరిశోధకులు అంటున్నారు.

ఎన్నెన్నో ట్విస్టుల కావ్యం

మహాభారతం జరిగిందా లేదా, జరిగితే ఎప్పుడు జరిగింది? అనే వాదన పక్కన పెట్టేస్తే.. ఒక కావ్యంలా చూస్తే మహాభారతంలో వందల కొద్దీ పాత్రలు, రకరకాల యాంగిల్స్​లో కథలు, లెక్క లేనన్ని ట్విస్టులు ఉంటాయి. ఇంత వివరంగా, ఇంత గ్రిప్పింగ్​గా మరో పుస్తకం ఉండదన్నది మాత్రం అందరూ ఒప్పుకుంటారు.

ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినట్లు మౌసల పర్వంలో ఉంది. యాదవుల మధ్య ముసలం (ఘర్షణ) తలెత్తడంతో కొట్లాడుకొని చనిపోయారని, తర్వాత సముద్రం పొంగి ద్వారకను ముంచేసిందని ఆ పర్వం చెబుతోంది.

అప్పట్లోనే ఇండియన్లకు మెరైన్​ టెక్నాలజీ తెలుసు అనడానికి ద్వారకా నగరమే ఉదాహరణ. గుజరాత్​లోని ఈ నగరంలోనే కృష్ణుడు నివసించినట్లు చెబుతారు. అరేబియా మహా సముద్రంలో మునిగిపోయిన ద్వారకను ఇప్పటికే పరిశోధించి అనేక విషయాలు తెలుసుకున్నారు. భారత, భాగవతాల్లో ప్రస్తావించిన ఈ కోస్ట్​ సిటీలో నౌకలు ఆగడానికి వీలుగా బెర్త్​లు, సరుకు రవాణాకి అనువుగా వార్ఫ్​లు, గస్తీ నిర్వహించడానికిగాను చెక్కలతో కట్టిన వంతెనలు, ఆటుపోట్లనుంచి హార్బర్​ని రక్షించడానికి జెట్టీలు, పటిష్టమైన కోట గోడలు వంటివి ఉన్నాయని కనుగొన్నారు.

అమెరికన్​ థియెరిటికల్​ ఫిజిసిస్ట్​ రాబర్ట్​ ఓపెన్​హీమర్​ అణుబాంబు తయారీ ప్రాజెక్ట్​కి ఇన్​చార్జి. జపాన్​పై వేసిన అణుబాంబులు ఆయన రూపొందించినవే. ఈ ప్రయోగంపై ఒక స్టూడెంట్​ అడిగిన ప్రశ్నకు… ‘ఇది ఫస్ట్​ ఆటమిక్​ బాంబు కాదు, మోడర్న్​ టైమ్స్​లో మొదటిది మాత్రమే’ అన్నారు. ఆయనకు భారతంపైనా, భగవద్గీతపైన గట్టి పట్టుంది. అణు ప్రయోగం సక్సెసయిన తర్వాత ‘సమస్త సృష్టినీ నశింపజేయగల  మృత్యువును నేనే (నౌ ఐయామ్​ బికమ్​ డెత్​, ది డిస్ట్రాయర్​ ఆఫ్​ వరల్డ్స్​)’ అనే భగవద్గీత శ్లోకాన్ని వాడారు ఓపెన్​హీమర్​. ఇది గీతలోని 11వ అధ్యాయం ‘విశ్వరూప సందర్శన యోగం’లోని 32వ శ్లోకం.

తక్షశిల

అప్పటి గాంధార దేశానికి రాజధానిగా తక్షశిలను చెబుతారు. పాకిస్థాన్​లోని రావల్పిండి నగరమే అప్పటి తక్షశిల. ప్రపంచంలోని మొట్టమొదటి యూనివర్సిటీ తక్షశిలలోనే ఏర్పడినట్లు గుర్తించారు. ఇప్పటికీ తక్షిలా పేరుతో పాకిస్ఠాన్​లో ఉంది.

ఉజ్జనక్

ఈ ప్రాంతంలోనే పాండవులకు, కౌరవులకు ద్రోణుడు విలువిద్య నేర్పాడంటారు. అతని ఆదేశాల మేరకు భీముడు ఇక్కడ శివలింగాన్ని  ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది.నాటి ఉజ్జనక్ నగరమే ప్రస్తుతం ఉత్తరాఖండ్​లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న కాశీపూర్​గా చెబుతారు.

హస్తినాపురం

ఈ నగరం చుట్టూనే భారతం నడిచింది. ఇది కురు సామ్రాజ్యపు రాజధాని. ఇప్పటి యూపీలోని మీరట్ నగరమే అలనాటి హస్తినాపురం అంటారు.

అంగదేశ్

కర్ణుడు పాలించిన ప్రాంతమే అంగదేశ్​. ఈ ప్రాంతాన్ని దుర్యోధనుడు ఇచ్చాడు. గోండా జిల్లా (యూపీ)లోని ఇప్పటి మాలినీ నగర్​నే అప్పటి అంగదేశం అంటారు.

ఇంద్రప్రస్త

ఇప్పటి ఢిల్లీనే అలనాటి ఇంద్రప్రస్తగా చెబుతారు. దీనిని రాజధానిగా చేసుకుని పాండవులు పరిపాలించినట్లు భారతం చెబుతోంది.

బృందావన్

శ్రీకృష్ణుడి బాల్యం బృందావనంలోనే గడిచిందని చరిత్రకారులు, సాహితీకారులు చెబుతున్నారు. యూపీలోని మథురకు పది కిలోమీటర్ల దూరాన బృందావనం ఉంది. కృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

వర్ణావత్​

పాండవులను చంపడానికి దుర్యోధనుడు ఇక్కడే లక్క ఇల్లు కట్టించాడని ప్రతీతి. ఇది యూపీలోని బాగ్​పట్​ జిల్లాలో ఉంది. యమునకు ఉపనది అయిన హిందోన్​ ఒడ్డున వర్ణావత్​ పట్టణం ఉంది.

కురుక్షేత్రం

మహాభారత యుద్దం జరిగిన ప్రాంతమే కురుక్షేత్రం. కౌరవులు, పాండవులు ఇక్కడే 18 రోజుల పాటు యుద్ధం చేశారు. కురుక్షేత్రం హర్యానాలోని ముఖ్య పట్టణం. కురు మహారాజు యాగం చేసిన భూమి కావడంతో కురుక్షేత్రంగా  పేరు వచ్చింది.