ఆధ్యాత్మికం : మహా భారత యుద్ధంలో 13వ రోజు ఏం జరిగింది.. ఆ రోజు అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు..!

ఆధ్యాత్మికం : మహా భారత యుద్ధంలో 13వ రోజు ఏం జరిగింది.. ఆ రోజు అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు..!

మహాభారత యుద్ధంలో పదమూడే రోజు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు ప్రాణాలు విడుస్తాడు. కన్నకొడుకు కన్ను మూశాడని అర్జునుడు తీవ్రంగా ఏడుస్తాడు. ఆవేశంతో తన కొడుకు చావుకి కారణమైన దుశ్శల భర్త జయద్రథుడ్ని చంపేస్తాడు. అయినా అర్జునుడి ఆవేదన తీరలేదు. అప్పుడు సర్వజ్ఞుడూ, సాక్షాత్తూ భగవానుడైన శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తాడు. కృష్ణా .. ఆనాడు గురుదేవులైన సాందీవుడి కుమారుడిని మీరు రక్షించారు కదా....నాకూ పుత్రబిక్ష పెట్టు గోవిందా.... అని ఏడుస్తూ వేడుకుంటాడు. యుద్ధం మొదలయ్యే ముందే పార్థునికి భగవద్గీత బోధించాను కదా..అన్నీ విన్నాడు...ఊ కొట్టాడు. అయినా పుత్రవాత్సల్యంతో విలవిలలాడుతున్నాడే అని ఆశ్చర్యపోతాడు శ్రీకృష్ణుడు. వెంటనే పుట్టినవారు గిట్టక తప్పదని జాతస్య హి ధ్రుదే మృత్యుః మరోసారి గుర్తు చేస్తాడు

ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదని ఎంత  చెప్పినా.. కడుపు శోకం అర్జునుడు తన కర్తవ్యం మరిచిపోయేలా చేసింది. అభిమన్యూ  ..  అభిమన్యూ  అని ఆపకుండా ఏడుస్తున్న అర్జునుడికి ప్రత్యక్షంగా పాఠం చెప్పాలనుకున్నాడు కృష్ణుడు. వెంటనే ఒక మాయ చేస్తాడు. సరే అర్జునా! నిన్న స్వర్గలోకానికి తీసుకెళ్తాను. నీ అభిమస్యుడిని నువ్వే ఈ భూలోకానికి తీసుకొచ్చుకో అన్నాడు. సంతోషంతో అంగీకరించి. కృష్ణుడితో కలిసి స్వర్గానికి వెళ్లాడు.

ఎవరు నువ్వు?

స్వర్గంలో యువరాజు కిరీటం పెట్టుకొని.. ఠీవీగా కూర్చొని రాచకార్యాల్లో మునిగి ఉన్నాడు అభిమన్యుడు. అది చూసిన అర్జునుడు ఆమితానందంతో కొడుకు దగ్గరికి పరిగెత్తుకెళ్లాడు. పుత్రా అభిమన్యూ ... భూలోకానికి వెళదాంరా అంటాడు. అభిమన్యుడు ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు... నేను నీతో భూలోకానికి రావడం ఏంటి? అన్నాడు. నేనవరో తెలియదా ? నేను నీతండ్రిని అంటాడు. నీవెవరో నా కసలు జ్ఞాపకమే లేదు.... ఎన్నో జన్మలు ఎత్తాను. ..నీవు ఏ జన్మలో తండ్రివో ?  నేను పోషించిన పాత్రలు చాలు నీతో రాలేను...  వెళ్లిపో అంటాడు. అప్పుడు అర్జునుడికి కనువిప్పు కలిగింది. మౌనంగా మాధవుడితో కలిసి భూలోకానికి పయనమవుతాడు.

మన దారి వంటి?

ప్రతీ మనిషి అర్జునుడిలాగే మమకారాల మాయలో పడి అసలు రహస్యాన్ని మరిచిపోతున్నాడు.  అందుకే భజగోవిందం చెప్పేటప్పుడు ఆది శంకరాచార్యుడి శిష్యుడు సురేంద్రడు నువ్వెవరో ?  నేనెవరో ? అని ప్రశ్నించుకోమంటాడు. నువ్వెవరు ? నేనెవరిని ? నేను ఎక్కడి నుంచి వచ్చాను ? నా తల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? నిస్సారమైన కలలాంటి ఈ ప్రపంచాన్ని పక్కనపెట్టి ఆలోచించమంటాడు.

ఇదంతా ఒక పెద్ద కల అని.. నిజమేంటో తెలుసుకొని నడుచుకోమంటాడు. నేనేవరు! అని ప్రశ్నించుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం అని రమణ మహర్షి చెప్తుండేవారు. ఇలా ఎప్పటికప్పుడు అనుబంధాలను ఎలాంటి దాపరికం లేకుండా విశ్లేషించుకుంటూ పోతే, ఒక్కొక్కటి దారపు పోగుల్లా విడిపోయి వాటి అసలు స్వరూపం అర్ధమవుతుంది. అప్పుడు ఈ కష్టసుఖాలు, రాగద్వేషాలు, జయా పజయాలన్న కాలంలో పుట్టి.. కాలంలో కలిసి పోయేవిగా ఓ కలలా తోస్తాయి. ఏకాంతంలోకి వెళ్లి కాసేపు ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి అసలు మనమేంటి? మనం నడుస్తున్న దారి ఏంటి? అని ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు... జీవితంలో ఏ అలజడి ఉండదు. దీనికి సాధనలేంచేయనక్కరలేదు.  కేవలం కళ్ల ముందు జరుగుతున్న వాటిని చూసి అంతర్మథనం చేసుకుంటే చాలు.  

తిరిగే జీవనచక్రం

చావు,  పుట్టుకల ఈ జీవన చక్రం ఎందుకిలా తిరుగుతుందో.... అని ఎవరికీ వాళ్లు ప్రశ్నించు కోవడం లేదు. అసలు మనం ఎందుకు ఇన్ని  బంధ'నాల్లో చిక్కుంటున్నాం అని అలోచించి అర్దం  చేసుకోవడం లేదు. ఇలా ఆలోచించడం  మొదలు పెడితే ఈ మాత్రం ప్రశాంతంగా కూడా ఉండలేమేమో అనే భయంతో చాలామంది  సంసార సాగరంలో కప్పల్లా ఈదుతూ ఏ తీరం చేరకుండా మునిగిపోతున్నారు. నిజంగా అలా ఆలోచిస్తూ పోతే తాము సాధించామనుకుంటున్న‌వన్నీ చిల్లిగవ్వల్లా అనిపిస్తాయన్న భయంతోనే అటువైపు ఆలోచన చేయడం మానేశారు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు ఆ చిల్లిగవ్వను జారవిడుచుకోక తప్పదు. అలా ఏదో జరిగిపోయాక పశ్చాత్తాప పడి వైరాగ్యం పెంచుకోవడం కన్నా.. ముందే వివేకంతో మెలగడం మంచిదని భజగోవిందం బోధిస్తోంది.

మరీమీరితే మనస్తాపం

దురదృష్టవశాత్తూ ఈ ఆధునిక ప్రపంచంలో ...  సుఖాలు ఏకాంతం నుంచి మనుషుల్ని దూరం చేస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వ్యసనం లోనో, వ్యాపకంలోనో పొద్దుపుచ్చేలా చేస్తున్నాయి. తన నిజవాసనేమిటో? నిజ గమ్యమేమిటో తెలియకుండా కళ్లకు గంతలు కట్టి పరుగులు తీయిస్తున్నాయి. అశాశ్వతమైన అనుబంధాలు ..  ఆనందం లాగా భ్రమలు కల్పిస్తున్నాయి. అల్పమైన వాటికోసం  అపురూపమైనవి జారవిడుచుకునేలా ప్రలోభపెడుతున్నాయి. అందుకే గౌతమ బుద్ధుడు అల్పమైన సుఖాన్ని వదులుకోవడం. వల్ల అధికమైన సుఖం కలుగుతుంది అనుకున్నప్పుడు బుద్ధిమంతుడివై సుఖం మీద దృష్టితో అల్పసుఖాన్ని విడిచిపెట్టు అని అంటాడు.

భగవంతుడే నిత్యం

జీవితంలో భయంకరమైన విషయాల్ని చూసినప్పుడు వైరాగ్యం ఎవరైనా పొందుతారు. అది సహజమే అందులో గొప్పతనం ఏముంది? ఒకసారి దీని గురించి ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. కాలం అన్నింటినీ తనలో కలిపేసు కుంటుందనే సత్యాన్ని గుర్తుంచుకుని రోజూ ఆత్మీయుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

అందుకే భగవంతుడే నిత్యం, మిగిలినవన్నీ అనిత్యం జీవులు, ప్రపంచం,  ఇల్లూ వాకిలీ పిల్లాజెల్లా అన్నీ గారడీలే. అతడు కర్రతో డోలును వాయిస్తూ.. క్షూ.. క్షూ,,, మంత్రకాళీ! రండి.... .గారడీ చూడండి  అంటూ ఉంటారు.  రండి... ఈ కుండ మూత తీయండని ప్రేక్షకులతో అంటాడు. మూత తీయగానే కుండలో నుంచి చాలా పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కానీ, గారడీ వాడే  సత్యం.. నిత్యం .. వాడు చేసే గారడీ ఇంతా అనిత్యం.   అనిత్యం అనేది అప్పటికప్పుడు ఉంటుంది. అంతలోనే మాయమవుతుంది అనేవారు రామకృష్ణ పరమహంస .

ప్రపంచంలో అందాలు ప్రేమలు, సుఖాలు అన్నీ ఈశ్వరచ్చాయలే. వాటితోనే ఆకర్షిస్తాడు. తనని గుర్తించేలా చేస్తాడు. ఆకర్షణలే మానవుడి అభివృద్ధికి అడ్డంకులవుతాయి. అదే మాయ గీతాంజలిలో విశ్వకవి కవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. మాయని ఛేదించుకోవాలంటే మళ్లీ పరమ ప్రభువు పాదాలనే ఆశ్రయించాలి. విచారణ కన్నా ముందు ఆయనపై విశ్వాసాన్ని పెంచుకోవాలి అంటారు మహర్షులు.

ఎవరితోనూ మితిమీరిన మానసికానుబంధాన్ని పెంచుకోకూడదు. వాళ్లే లోకం అనుకోకూడదు. అలా దశరథుడు లేకలేక కలిగిన కొడుకు శ్రీరామచంద్రుడిపై విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాడు. కానీ, కాలం కైక రూపంలో మమకారంపై కాటేసింది. ఇలా పరిమితులు మించి ప్రేమ పరిధులు దాటుతున్న ప్రతి సందర్భంలోనూ నేనెవరు? వారెవరు? అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. కోరికను పెంచుకున్న ప్రతి వ్యక్తినీ కనికరం లేకుండా వాళ్ల నుంచి లాగేసుకోవడమే కాలపురుషుడి పని!  సముద్ర కెరటం హఠాత్తుగా వచ్చి, పసిపిల్లాడు తీరంలో ఇష్టంగా కట్టుకున్న ఇసుక గూటిని తనలో కలిపేసుకున్నట్టు, కాలం మనకు ఇష్టమైనవాటిని అన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తనలో కలిపేసుకుంటుంది.
 

–వెలుగు, లైఫ్​–