ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పదేండ్ల కిందట ఆధార్​ పొందిన వారు దాన్ని ఇప్పుడు అప్​డేట్​ చేసుకోవాలని కలెక్టర్​ వెంకట్​ రావు సూచించారు. కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​లో ఆధార్ అప్​డేట్​పై అవగాహన పోస్టర్​ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. పేరు, పుట్టిన తేదీ, ఫొటో చిరునామా వంటి వివరాలు అప్ డేట్ చేసుకోవచ్చని, తరచుగా చాలా మంది అడ్రస్ లు మారడం , లేదా ఆధార్​లో తప్పులు రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు తప్పకుండా అప్​డేట్​ చేసుకోవాలని చెప్పారు. ఈ అప్​డేట్​ను ఆన్లైన్​ ద్వారా, ఆధార్ కేంద్రం ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మీసేవ ఏవో కిషోర్, ఈ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, మీసేవ కేంద్రం ఆపరేటర్లు కాశీ, రాజేశ్​, రాహుల్ జిల్లా కోఆర్డినేటర్ ఇలియాస్ ఉన్నారు.    

 

రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేయాలి

వనపర్తి, వెలుగు: జిల్లాలో రోడ్ల విస్తరణ పనులను స్పీడ్​గా చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. పనులపై కలెక్టరేట్​లో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో తో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగతా పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్​ పరిధిలో చేపట్టిన అనధికారిక కట్టడాలను మూడు రోజుల్లో కూల్చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్మాణ అనుమతులు తప్పనిసరని, వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ స్థంభాల ఏర్పాటు పనులను వారం రోజుల లోపు పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. అనంతరం పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్ డివైడర్ పనులు, బై పాస్ రోడ్ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ అపూర్వ రావు, మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. 

గ్రామాల్లో ఎప్పుడూ నిఘా ఉంచాలి

గద్వాల,వెలుగు: గ్రామాల్లో నేరాలను నియంత్రించేందుకు నిరంతరం నిఘా  ఉంచాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పోలీసులకు సూచించారు.  గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ  సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి, కేసుల  నమోదు,  పెండింగ్​ కేసుల వివరాల తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ ఆఫీసర్లకు అప్పగించిన  విభాగాలలో డ్యూటీ పక్కాగా చేయాలన్నారు. గ్రామాల్లో తరచు పర్యటిస్తూ సమస్యలు తెలుసుకోవాలన్నారు.  ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ పోలీసు వ్యవస్థపై ఫోకస్​ పెట్టాలన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల పై నిఘా ఉంచాలన్నారు. పోలీస్ స్టేషన్ లో  శ్రమదానం చేయాలన్నారు. ఎస్పీ వెంట సీఐ చంద్రశేఖర్, సీసీ లోహిత్ కుమార్  ఉన్నారు.

సకాలంలో లోన్లు మంజూరు చేయాలి

వనపర్తి, వెలుగు : స్వయం ఉపాధి రుణాలను   సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా బ్యాంకర్లను ఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో గురువారం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్  తదితర పరిశ్రమలకు రుణాల  ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ పథకాలకు రుణాలు ఇవ్వాలని అధికారులకు ఆమె సూచించారు. గత సంవత్సరం రుణాలను తిరస్కరించారని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. 2022 – 23 సంవత్సారానికి దరఖాస్తు చేసుకున్న వారిలో  100 యూనిట్లకు లోన్లు ఇవ్వాలన్నారు.  కొంతమంది నిరుద్యోగులు బృందంగా ఏర్పడి పాడిపరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే లోన్​ మంజూరు చేయాలన్నారు. రుణాల కోసం వచ్చని 107 అప్లికేషన్లను  వివిధ బ్యాంకులకు పంపినట్టు  లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ తెలిపారు.  సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎల్ డీ ఎం. అమూల్ పవర్, డీ ఆర్ డీ ఏ నరసింహులు, ఇండస్ట్రియల్ అధికారి యాదగిరి, బ్యాంకర్లు పాల్గొన్నారు.

సబ్​ జైలును విజిట్​ చేసిన జడ్జి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో ఖైదీల పరిస్థితిపై  జడ్జి రాజేశ్​ బాబు ఆరా తీశారు. గురువారం సబ్ జైలులో ఆయన మీటింగ్ నిర్వహించారు. ఖైదీలకు భోజన వసతి గురించి వివరాలు తెలుసుకున్నారు. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఖైదీల ప్రవర్తన ను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ జడ్జి స్వరూప, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, న్యాయవాదులు సత్యనారాయణ రావు, జీవన్ కుమార్ పాల్గొన్నారు. 

సర్టిఫికెట్ల కోసం అభ్యర్థుల ఆందోళన

లింగాల, వెలుగు: ఇటీవల   పోలీస్​   పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈవెంట్స్​ అప్లికేషన్​కు  అవసరమైన సర్టిఫికెట్ల కోసం  తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేశారు.  ఇన్​కమ్, క్యాస్ట్, లోకల్, నాన్ క్రీమిలేయర్​  కోసం వచ్చిన అభ్యర్దులకు  మూడు, నాలుగు రోజులైనా    ఇవ్వడం లేదని  ఆందోళనకు దిగారు.  రెండో అప్లికేషన్ కు 10వ తేదీ వరకు గడువు ఉందని, అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో పాండు మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరలో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

జిల్లాలో బీజేపీ  నిరసనలు

మిడ్జిల్/ వనపర్తి/ మద్దూరు,  వెలుగు: మునుగోడు లో బై ఎలక్షన్ సందర్భంగా పోలీసులు, అధికారులు టీఆర్ఎస్ కు   ఏకపక్షంగా సపోర్ట్  చేశారంటూ  ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు.   వనపర్తిలో  రాజీవ్​ చౌరస్తాలో ,  మిడ్జిల్​లోని  అంబేద్కర్ విగ్రహం  ఎదుట  నల్లబ్యాడ్జీలో నిరసన తెలిపారు.   నారాయణపేట  జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మదన్   మండలకేంద్రంలోని పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల పోలింగ్​ సందర్భంగా టీఆర్ఎస్  ఎమ్మె ల్యేలు, మంత్రులు యథేచ్చగా  ఓటర్లకు డబ్బులు పంచుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను నియోజకవర్గం నుంచి బయటికి పంపించడాన్ని ఖండించారు.  మునుగోడులో గెలుపు బీజేపీదే అని నినాదాలు చేశారు. 

మల్టీ మీడియా డిజైనింగ్​లో ఉచిత శిక్షణ

మక్తల్​, వెలుగు: ఇంటర్ పూర్తి చేసుకున్న మఖ్తల్ నియోజకవర్గ విద్యార్థులకు మల్టీమీడియా, యానిమేషన్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ తెలిపారు. ప్రిసమ్ ఎడ్యుకేషన్ సొసైటీతో ఒప్పందం చేసుకొనొ, విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.  గ్రాఫిక్ , వెబ్​ డిజైనింగ్​, మల్టీ మీడియా కోర్సులు నేర్పిస్తామని చెప్పారు.  వివరాలకు 6300368705 , 8123123434  నంబర్లకు కాల్​ చేయొచ్చని చెప్పారు.

63 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత 

కోస్గి టౌన్, వెలుగు : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో  ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఎన్  ఫోర్స్​మెంట్​ డీటీ ఆనంద్ కథనం మేరకు గురువారం హకీంపేట్ లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం  వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి  పరిశీలించారు.   బొలెరోలో  పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించామన్నారు.  దాంట్లోని 63 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ  జగదీశ్వర్ తెలిపారు.