కార్తీకమాసం స్పెషల్ : దేశంలోనే అరుదైన శివ పార్వతుల గుడి.. మన తెలంగాణలోనే..

కార్తీకమాసం స్పెషల్ : దేశంలోనే అరుదైన శివ పార్వతుల గుడి.. మన తెలంగాణలోనే..

దక్షిణాదిలో ఏ శివాలయంలో చూసినా.. శివలింగం మాత్రమే ఉంటుంది. అభిషేకాలు, పూజలు అన్నీ శివుడికే చేస్తారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు శివాలయంలో మాత్రం శివపార్వతులు ఇద్దరూ పూజలందుకుంటున్నారు. ఇక్కడ శివుడు, పార్వతి విగ్రహాలను కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించారు

ఈ శివాలయాన్ని 12వ శతాబ్దలో  కాకతీయులు కట్టించారు. దక్షిణాది  మొత్తంలో ఇలాంటి ఆలయాలు రెండో... మూడో ఉన్నాయి. ఈ దేవాలయంలో శివ పార్వతుల విగ్రహాలతో పాటు శివలింగం, దక్షిణామూర్తి, వీరభద్రుడు, గణపతి, రెండు నందుల విగ్రహాలు కూడా ఉన్నాయి. తరువాత  దాతల సహకారంతో ధ్వజస్తంభం నాగదేవత విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు శివ పార్వతులకు ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలు సమర్పించి, పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. ప్రతి నెలా మాస శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ శివాలయం ప్రతి సోమవారం భక్తులతో కిక్కిరిసిపోతుంది. గణపతి నవరాత్రి ఉత్సవాలతో పాటు, కార్తీకమాసంలో కన్నుల పండువగా లక్ష దీపోత్సవం చేస్తారు. సోమవారం మొదలైన ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు..

కనుమరుగయ్యే దశ..

ఈ ఆలయాన్ని చాలా కాలంపాటు ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. అద్భుతమైన శిల్పాలు ఉండడంతో పాటు, 800 సంవత్సరాల క్రితం కట్టించినది. కావడంతో ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. కానీ... టెంపుల్​ ను  డెవలప్ చేయడానికి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. గూడూరుకు చెందిన పర్వతోజు నరేష్ శాస్త్రి  ఆలయంలో పూజలు చేయడం మొదలుపెట్టాడు. దాంతో భక్తులు రావడం మొదలైంది. తర్వాత రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.  తర్వాత 40 మంది సభ్యులతో 'శివం సేవా' సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో కార్తీక ఉత్సవాలు ప్రతి రోజు జరుగుతున్నాయి.

–వెలుగు, లైఫ్​‌‌–