పెబ్బేరు -వనపర్తి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించండి

పెబ్బేరు -వనపర్తి రోడ్డు  విస్తరణ పనులు ప్రారంభించండి

పెబ్బేరు/ శ్రీరంగాపూర్​, వెలుగు: పెబ్బేరు -వనపర్తి రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్​ఆదర్శ్​సురభి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ,  పెబ్బేరు, శ్రీరంగాపూర్​ మండలాల్లోని  వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ మండలంలోని ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.  మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని హాస్టల్​ వార్డెన్లకు సూచించారు. శేరిపల్లి శివారులో రంగసముద్రం నీటి విడుదల ద్వారా దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను పరిశీలించి.. నష్టాలపై అధికారులను ఆరా తీశారు.   

పెబ్బేరు మండలంలోని రంగాపూర్​ గ్రామంలో పర్యటించి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు.  విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి ఇంగ్లీష్ లోనే టీచింగ్ చెప్పాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పెబ్బేరు పట్టణంలో వనపర్తి వెళ్లే రోడ్డుపై విద్యుత్  స్తంభాలను పక్కకు జరపాల్సి ఉండటంతో విస్తరణ పనులు ఆగిపోయినట్లు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. విద్యుత్ స్తంభాలు మార్చేందుకు మున్సిపాలిటీ నుంచి సగం నిధులు ఇవ్వాలని మిగిలిన సగం కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు.  బీసీ హాస్టల్, స్థానిక పీహెచ్​సీలను సందర్శించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  శ్రీరంగాపూర్, పెబ్బేరు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ డీఎంహెచ్​వో సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రవళిక, మెడికల్ ఆఫీసర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.