మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: డాక్టర్లు దేవుళ్లతో సమానమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉస్మానియా, గాంధీ తర్వాత అంత మంచి పేరున్న మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్‌దేనని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 3వేల మంది మెడికల్ స్టూడెంట్లు, 1400 మంది పీజీ డాక్టర్లను తయారు చేస్తున్నామని చెప్పారు. 170 మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లను దేశానికి అందిస్తున్నామన్నారు. జిల్లాకు ఇదివరకే నర్సింగ్ కాలేజీ మంజూరు కాగా, కొత్తగా డెంటల్ కాలేజీ రానుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించాలనే సంకల్పం ఉండాలని సూచించారు. కాలేజీ డైరెక్టర్ డాక్టర్ రమేశ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, డాక్టర్ శామ్యూల్, డాక్టర్ రామ్మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కిరణ్, నవకల్యాణి, సునంద పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం కోసం కమిటీని మార్చిన్రు
గద్వాల, వెలుగు: టీఆర్‌ఎస్ లీడర్లు ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం ఎస్‌హెచ్‌జీ గ్రామ కమిటీని మార్చారని గద్వాల మండలం మదనపల్లె గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఆరోపించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఉన్న వెంకటమ్మను మెజార్టీ లేకపోయినా తొలగించి ఇతరులను ఎంపిక చేసుకున్నారని మండిపడ్డారు. గ్రామంలో 14 మహిళా సంఘాలు ఉన్నాయని, మూడు సంఘాలు ఆన్ లైన్ లో నమోదు కాలేదన్నారు. 11లో రెండు సంఘాలు పొదుపు చేయకపోవడంతో పెండింగ్ ఉన్నాయన్నారు. మిగతా 9 సంఘాలు యాక్టివ్‌గా ఉన్నాయని, ఈ సంఘాలన్ని కలిసి కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. కానీ, కేవలం మూడు సంఘాలను గ్రామపంచాయతీలో పెట్టుకొని ఏకపక్షంగా గ్రామ మహిళా కమిటీని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి సంఘానికి సంబంధించి ముద్ర కూడా వేరే సభ్యుల దగ్గర ఉండగా, వారికి తెలియకుండానే నకిలీ స్టాంప్ తయారు చేయించి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. ఇల్లీగల్‌గా కమిటీని మార్చారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. మెప్మా సీసీ ఆనందమ్మను వివరణ కోరగా.. మహిళా సంఘాలు తీర్మానం ఇవ్వడంతోనే కమిటీని మార్చి అకౌంట్ ఓపెన్ చేశామని చెప్పారు.
రాష్ట్రంలోనూ కమలం జెండా ఎగిరేస్తం : బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: తెలంగాణలోనూ కమలం జెండా ఎగరవేస్తామని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుజరాత్ ప్రజలు ఉచిత పథకాలకు ఆశపడకుండా రాష్ర్ట, దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అని చెప్పి బారుల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టౌన్ ప్రెసిడెంట్ నారాయణ యాదవ్, జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్, నాగరాజు, యాదవ్ విజయ్, కుమార్ గౌడ్, యువ మోర్చా నేత దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం : కాశపోగు రాజు
శాంతినగర్, వెలుగు: ఎమ్మెల్యే అబ్రహంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వడ్డేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను హెచ్చరించారు. శుక్రవారం శాంతినగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్ తీసుకున్నారని ఆరోపిస్తున్న సంపత్ దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. లేదంటే చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంపత్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇసుక లారీలకు అడ్డంపడి డబ్బులు వసూలు చేశారని, నకిలీ మిర్చి విత్తనాల సెటిల్మెంట్‌లో కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. నిందలు వేయడం మాని నియోజకవర్గ అభివృద్ధి గురించి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రెస్ మీట్‌లో వెంకట్రామ నగర్ సర్పంచ్ ఆంజనేయులు, నేతలు మహేశ్, రాజు, ప్రకాశ్ , తిమ్మయ్య, మత్తు, రాజు, హంపిరాజు పాల్గొన్నారు.
బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే చల్లా
అలంపూర్, వెలుగు: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. 15 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చల్లావెంకట్రామిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈయన, భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా మనవడు (కూతురు కొడుకు). ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన స్వర్గీయ చల్లా రాంభూపాల్ రెడ్డి కొడుకు. పుల్లూరు గ్రామం నుంచి సర్పంచిగా ఎన్నికైన చల్లా... 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆయన మద్దతిచ్చిన అభ్యర్థులే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇన్నాళ్లు తెరవెనక ఉన్న ఆయన ప్రతక్ష్యంగా బీఆర్ఎస్‌లో చేరడంతో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంది.
గోడౌన్ నిర్మాణ స్థలంలో దళిత రైతుల ఆందోళన
జడ్చర్ల, వెలుగు: గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అభివృద్ధి పేరిట గుంజుకోవడంపై జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన బాధిత రైతులుశుక్రవారం ఆందోళనకు దిగారు. ఆ స్థలంలో పాతిన కడీలు విరగొట్టి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నాగసాల గ్రామంలోని సర్వే నెంబర్ 83లో చిన్న నాగయ్య, పెద్ద నాగయ్య, చెన్నయ్య,పెంటయ్య, వెంకటయ్యలకు గత ప్రభుత్వం 7 ఎకరాల అసైన్డ్ భూమి ఇచ్చింది. ఇందులో చిన్న నాగయ్య,పెద్దనాగయ్య గ్రామానికి చెందిన రఘుయాదవ్‌కు అమ్మారు. అసైన్డ్ భూమి కావడంతో పట్టా మార్పిడి జరుగలేదు. ఇది పెద్ద నాగయ్య,చిన్న నాగయ్య పేర్ల మీదనే ఉండిపోయింది. ఇదిలా ఉండగానే నిరుడు మొత్తం స్థలాన్ని కలెక్టర్జడ్చర్ల సింగిల్ విండో ఆధ్వర్యంలో రూ.1.87 కోట్లతో నిర్మించనున్న గోడౌన్ నిర్మాణానికి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చైర్మన్ సుదర్శన్ గౌడ్ చుట్టూ కడీలు పాతించి శుక్రవారం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బోర్డ్రిల్లింగ్చేస్తుండగా బాధిత రైతులు కేవీపీఎస్ జిల్లా ప్రెసిడెంట్ జగన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నిర్మాణం స్థలం చుట్టూ పాతిన సిమెంట్ కడీలను విరగొట్టి.. విండో చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. తమకు తెలియకుండా భూమిని ఎలా గుంజుకుంటారని, తమ భూమి తమకు ఇవ్వకుంటే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరిం చారు. దీంతో చైర్మన్ తహసీల్దార్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ధరణి సమస్యలు పరిష్కరించండి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నారాయణపేట, వెలుగు: ధరణిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శుక్రవారం అన్ని మండలాల తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూమీసేవ ద్వారా రైతులు పెట్టుకున్న ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. టీఎం 33, మ్యుటేషన్ , సక్సేషన్ అప్లికేషన్లు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్‌చేసి అప్రూవ్ చేయాలన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత తహసీల్దార్లపై ఉందని, ఎక్కడైనా ఆక్రమణకు గురైతే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఓటరు నమోదుపై మాట్లాడుతూ ఫారం 6,7,8 సంబంధించి 14,831 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పారు. వాటిని పరిశీలించి 2023 జనవరి 5న ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పద్మజ రాణి, ఏవో నర్సింగ్ రావు, పీఎస్ నాగేందర్, జగదీశ్వర్ పాల్గొన్నారు.
‘సీఎంఆర్’పై నిర్లక్ష్యం వద్దు : అడిషనల్ కలెక్టర్ మోతీలాల్
కందనూలు, వెలుగు: సీఎంఆర్(కస్టమ్స్ మిల్లింగ్ రైస్)పై నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ మిల్లర్లు, అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడుతూ గత వానాకాలం సీజన్‌కు సంబంధించి 80,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు అందించామని చెప్పారు. 60,315 మెట్రిక్ టన్నులకు సంబంధించి బియ్యం ఇచ్చారని, ఇంకా 20,164 మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ చేయవలసి ఉందన్నారు. డిసెంబర్ 25 నాటికి సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు 3 వేల మెట్రిక్ టన్నుల రైస్ ఉత్పత్తి చేసి ఎఫ్‌సీఐకి పంపించాలని సూచించారు. ఈ వానాకాలానికి సంబంధించిన 9 ,400 మెట్రిక్ టన్నుల రైస్‌ను అందించాలని ఎఫ్‌సీఐ ఆదేశించిందని చెప్పారు. ఇందుకు అనుగుణంగా మిల్లింగ్ చేయాలని సూచించారు. ఈ యేడు రైతుల నుంచి 49,151 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లర్లు తీసుకున్నా.. రసీదులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ మోహన్ బాబు, మేనేజర్ బాలరాజ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, నవీన్, హకీం రాజేశ్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే యాత్ర
వీపనగండ్ల(చిన్నంబావి), వెలుగు: ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో కొల్లాపూర్ ప్రగతి యాత్ర చేపట్టలేదని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజల వద్దకు వెళ్తున్నానని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని బెక్కెం గ్రామం నుంచి గూడెం మీదుగా పెద్ద దగడ గ్రామానికి చేరుకుంది. బిక్కెం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వరివేస్తే ఊరే నని రైతులను ఆగం చేశారన్నారు. ఒకసారి సన్నవడ్లు, ఇంకోసారి దొడ్డువడ్లు అంటూ కన్ఫూజ్ చేశారని మండిపడ్డారు. ధ్యానం సేకరణకు కేంద్రమే నిధులు ఇస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కేంద్రం సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి రోజారమణి, కొల్లాపూర్ నియోజక వర్గ కన్వీనర్ శ్రీనివాసులు, కో కన్వీనర్ అవినాష్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల అధ్యక్షులు జగ్గారి శ్రీధర్ రెడ్డి, రాకేశ్ పాల్గొన్నారు.
వైభవంగా రథోత్సవం
ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున మల్దకల్ మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి( తిమ్మప్ప స్వామి) రథోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం దర్శనం కోసం బారులు తీరారు. ధన్వాడ మండలం గున్ముక్ల కడపరాయస్వామి రథోత్సవంలో భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. అంతకుముందు పూజారులు స్వామి వారి ఉత్సవమూర్తిని పల్లకీలో తెచ్చి రథంపై ఉంచి పూజలు చేశారు. మక్తల్ పట్టణంలోని పడమటి అంజన్న ఉత్సవాల్లో భాగంగా పాలఉట్ల కార్యక్రమం నిర్వహించారు. - గద్వాల, ధన్వాడ, మక్తల్, వెలుగు