
మహబూబాబాద్, వెలుగు: యాసంగిలో ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, తాగునీరు, మరుగుదొడ్ల, సౌకర్యాలు కల్పించాలన్నారు. సివిల్ సప్లై, రెవెన్యూ, సహకార శాఖ, ఐకేపీ, పోలీస్, లీగల్ మెట్రాలజీ, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ, రవాణా శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి లక్ష్యం చేరాలన్నారు.
సమీక్షలో అడిషనల్కలెక్టర్ కె.వీరబ్రహ్మాచారి, తొర్రూరు, మహబూబాబాద్ ఆర్డీవోలు గణేశ్, కృష్ణవేణి, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 69 దరఖాస్తులు వచ్చినట్లు అడిషనల్కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు.