
మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శంకర్ నాయక్ తీరుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దని చెబుతున్నారు. మూడోసారి మార్చకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. శంకర్ నాయక్ కు టికెట్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి.. నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
‘‘మాకు వద్దు ఈ ఎమ్మెల్యే’’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణ శివారులోని ఓ మామిడి తోటలో దాదాపు 100 మంది ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మరోసారి టికెట్ ఇస్తే తాము సపోర్టు చేయమని స్పష్టం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో భూకబ్జాలకు, సెటిల్ మెంట్లకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమకు వద్దంటూ అధిష్టానాన్ని కోరారు.
అధికారపార్టీ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తిరుగుబాటు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మరోసారి మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి.