కురవి, వెలుగు: కురవి గిరిజన ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య గురుకులాలను మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం కురవి గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని తిని చూశారు. గూడురు మండలం దామరవంచ పాఠశాలలో విద్యార్థులకు పుడ్ పాయిజన్ కావడంతో కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏకలవ్య గురుకులాన్ని సందర్శించారు. భోజనంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ సునీల్ రెడ్డి తదితరులున్నారు.
సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తొర్రూరు, వెలుగు: విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మహబూబాద్ తొర్రూరు సమీకృత వసతి గృహం, కస్తూర్బా పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, డైనింగ్ హాల్, మూత్రశాలలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఆయనవెంట కేజీబీవీ ప్రిన్సిపాల్ శైలజ, మున్సిపల్ మేనేజర్ కట్టా స్వామి, శానిటరీ ఇన్ స్పెక్టర్ కొమ్ము దేవేందర్, హెల్త్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.