తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. చిన్నవంగరలో కేజీబీవీ భవన నిర్మాణ పనులను, చిట్యాల గ్రామంలో మన ఊరు, -మన బడి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో కేజీబీవీ విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి శాశ్వత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. పాఠశాలలకు మిషన్ భగీరథ కనెక్షన్ పూర్తి చేయాలని, ప్రహరీ గోడ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. చిట్యాలలో మన ఊరు, -మన బడి పనులు స్లోగా సాగడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మండలవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని తెలుసుకుని విస్తుపోయారు. మన ఊరు, -మన బడి కార్యక్రమం కింద 12 పాఠశాలలను ఎంపిక చేయగా, కనీసం రెండు స్కూళ్లలో కూడా పనులు పూర్తి చేయకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ హై, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, డీసీవో ఎస్డీ ఖుర్షీద్, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ నరేందర్, ఆర్డీవో రమేశ్, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి తదితరులున్నారు.
సర్పంచ్ ను సస్పెండ్ చేయాలి
నర్సంపేట, వెలుగు: దళిత వ్యక్తిపై దాడి చేసిన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ సర్పంచ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళితుడు తాటికాయల సూరయ్యను ఆయన పరామర్శించారు. దసరా రోజు డప్పు కొట్టేందుకు ఆలస్యంగా వచ్చాడని ఆగ్రహిస్తూ సూరయ్యను కులం పేరుతో సర్పంచ్ దూషిస్తూ, విచక్షణా రహితంగా కొట్టడం దారుణమన్నారు. టీఆర్ఎస్ పాలనలో దళితులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కట్టయ్యపై అట్రాసిటీ కేసు ఫైల్ చేసి, సస్పెండ్ చేయాలని కోరారు. లేదంటే రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బీజేపీ లీడర్లు బాల్నే జగన్, గూడూరు సందీప్, కొంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
కాన్షిరాం మార్గంలో పయనించాలి
వెలుగు నెట్ వర్క్: బహుజనులకు కాన్షిరాం ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని బీఎస్పీ లీడర్లు పేర్కొన్నారు. ఆదివారం కాన్షిరాం 16వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ లీడర్లు బైక్ ర్యాలీలు తీశారు. అంతకుముందు కాన్షిరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. కాన్షిరాం ఒక మహనీయుడని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవనాన్ని నిశితంగా పరిశీలించి, బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు.
ఆత్మరక్షణకు కరాటే తోడ్పాటు
కాశిబుగ్గ, వెలుగు: ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్ అన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సిటీలోని గాంధీనగర్ లో కిజామీ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే క్యాంప్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా సీఐ పాల్గొని కరాటేలో ప్రతిభ కనబర్చిన స్టూడెంట్లకు ప్రైజ్ లు అందజేశారు. స్టూడెంట్లు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు సెలవులను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ధన్ రాజ్, మున్నా, లీనా, సన్నీ తదితరులున్నారు.
నెక్కొండలో గుప్తనిధుల తవ్వకాలు!
నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. మండలంలోని అప్పల్ రావుపేట గ్రామానికి చెందిన యాసం పెద్దకొమురయ్య పొలంలో కొందరు వ్యక్తులు తవ్వకాలు జరిగి పూడ్చి వేశారు. తవ్వకాలకు పాల్పడిన దుండగులు ఎవరనేది తెలియాల్సి ఉంది. గతంలోనూ ఈ గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు జరగగా ఓ వ్యక్తి అరెస్టు అయ్యాడు.
ట్రస్మా కొత్త కార్యవర్గం ఎన్నిక
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల ట్రస్మా కొత్త కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా తాళ్లపల్లి రమేశ్, కార్యదర్శిగా వేముల రమేశ్, సలహాదారుడిగా నరేశ్‌రెడ్డి నియామకమయ్యారు. ఎన్నికల ఆఫీసర్లుగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కుడుముల శంభారెడ్డి, ముత్తినేని జయప్రకాశ్, అనుమాండ్ల దేవేందర్ రెడ్డి వ్యవహరించారు. విద్యార్థులకు తక్కువ ఫీజుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని తాళ్లపల్లి రమేశ్ పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాలి
హనుమకొండ సిటీ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చడం అంటే అణగారిన వర్గాలపై దాడి చేయడం లాంటిదేనని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) జాతీయాధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘రాజ్యాంగ పరిరక్షణ సదస్సు’కు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అదానీ ఒక రోజు ఆదాయం రూ.1064 కోట్లుగా ఉందని, దేశంలో 125 కోట్ల మంది జనాభాలో ఎవరికీ రాని ఆదాయం, అదానీకి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పేద ప్రజలు 60 గజాల ఇంటి జాగ కోసం పోరాటాలు చేస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో సీపీఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క శంకర నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, మేకల రవి, విజయసారథి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
జెండా తీస్తుండగా కరెంట్ షాక్
మద్యంమత్తులో కొందరు హల్చల్
స్పాట్లో యువకుడు మృతి
కురవి, వెలుగు: ఫ్రెండ్స్ తో మద్యం తాగి, కాంగ్రెస్ జెండాను తొలగిస్తుండగా కరెంట్ షాక్ కు గురై ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల శివారు లింగ్యా తండాలో జరిగింది. ఎస్సై మధు వివరాల ప్రకారం.. లింగ్యా తండాకు చెందిన మాలోత్ సునీల్(24) శనివారం అర్ధరాత్రి ఫ్రెండ్స్ తో కలిసి మద్యం తాగాడు. అందరూ కలిసి తండాలోని కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె వద్దకు చేరుకున్నారు. సునీల్ గద్దెపై ఉన్న కాంగ్రెస్ జెండాను తొలగిస్తుండగా.. పైన ఉన్న కరెంట్ వైర్లు తాకాయి. దీంతో షాక్ కొట్టి స్పాట్లో చనిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునీల్ తో కలిసి మద్యం తాగిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తమ కొడుకుకు మద్యం తాగించి, హత్య చేసి, కరెంట్ షాక్ కొట్టినట్లుగా చిత్రీకరించారని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు.
కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో దాతల సాయంతో కొత్తగా నిర్మించనున్న తహసీల్దార్ ఆఫీస్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ పథకాలను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మోడీ సర్కార్కుట్రపూరిత విధానాలను అవలంబిస్తోందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా.. కేంద్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో 1500 మందికి దళిత బంధు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఉచిత ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ శశాంకను కోరారు. అనంతరం స్థలదాతలను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ తదితరులున్నారు.
రాజరాజేశ్వరీ ఆలయంలో పూజలు
పాలకుర్తి(కొడకండ్ల): జనగామ జిల్లా కొడకండ్లలోని శ్రీ రాజరాజేశ్వరీ ఆలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. శ్రీ మహా చక్ర శరత్ కాలమహోత్సవం సందర్భంగా పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ పేరం రాము తదితరులున్నారు.
చేపలకు గాలమేసిన మంత్రి..
నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కాసేపు తన కాన్వాయ్ ఆపి చేపలకు గాలం వేశారు. నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెంలో రోడ్డుపక్కన ఉన్న కాలువలో సరదాగా చేపలు పట్టారు. అక్కడున్న వారితో మాట్లాడి, వారి బాగోగులు తెలుసుకున్నారు.
నిట్ ఫ్యాకల్టీకి సత్కారం
కాజీపేట, వెలుగు: నిట్‌లో 25 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఫ్యాకల్టీని ఆదివారం పూర్వ విద్యార్థుల సంఘం ఘనంగా సత్కరించింది. అలాగే ఉత్తమ ప్రతిభకనబర్చిన 10మందికి యాజమాన్యం అవార్డులు అందజేసింది. ఏటా సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉత్తమ బోధన, పరిశోధన పరంగా ఫ్యాకల్టీని ఎంపిక చేసి అవార్డులు అందజేస్తున్నామని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ చీఫ్ జీఎం సునీల్ కుమార్, ఫ్యాకల్టీ వెల్ఫేర్ డీన్ ప్రొ. అంబాప్రసాద్, ప్రొ. సుబ్రమణ్యం, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ తదితరులున్నారు.
భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
వెలుగు నెట్ వర్క్ : మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకల్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆదివారం ఉదయాన్నే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ప్రవక్త బోధనలు వినిపించారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పలు సెంటర్లలో ఖీర్ పంపిణీ చేశారు. పేషెంట్లకు పండ్లు అందజేశారు. ప్రపంచ శాంతికి కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో కలిసిమెలసి జీవించాలని కోరారు. -
ఘనంగా వాల్మీకి జయంతి
వెలుగు నెట్ వర్క్: ఆదికవి, రామాయణ గ్రంథ రచయిత వాల్మీకి జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. కలెక్టరేట్లలో అధికారికంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలోనూ వేడుకలు జరిగాయి. వాల్మీకి రచనల్లోని విలువలను నేటి జీవనానికి అన్వయించుకుని, ఆదర్శంగా బతకాలని వక్తలు సూచించారు.