మహబూబాబాద్, వెలుగు : మైక్రో అబ్జర్వర్లు అలర్ట్‌గా ఉండాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలో డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలతో పాటు, కొత్తగూడ, గంగారం మండలాలు ములుగులో, గార్ల, బయ్యారం మండలాలు ఇల్లందులో, పెద్దవంగర, తొర్రూరు మండలాలు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాయన్నారు.
మొత్తంగా 773 పోలింగ్ కేంద్రాలు ఉండగా 106 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మరుగుదొడ్లు, తాగునీరు, వీల్ చైర్ సౌకర్యం తోపాటు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు కూడా చేశామన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఒకరోజు ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ సూర్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి, డీఈవో రామారావు పాల్గొన్నారు.
కాంపౌండ్ వాల్ లేని స్కూళ్లకు బారికేడ్లు ఏర్పాటు చేయాలి
కాంపౌండ్ వాల్ లేని స్కూల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల భద్రతకు తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్ మండలం వీఎస్.లక్ష్మీపురం గ్రామంలోని హైస్కూల్‌ను సోమవారం పరిశీలించారు. మన ఊరు మన బడి కింద నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు చేపట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్‌లో పోలింగ్‌కు అనుకూలంగా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఉన్నారు.