గూడూరు,వెలుగు: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లకు మహబూబాబాద్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు సీఐ బాబురావు బుధవారం వివరాలు తెలియజేశారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేటకు చెందిన ఎస్కె ఇస్మాయిల్, గూడూరు మండలం కోబల్తండాకు చెందిన ధరంసోతు శ్రీను, బ్రాహ్మణపల్లి శివారు ఆముతండాకు చెందిన ధరంసోతు కిరణ్ కుమార్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండకు చెందిన పల్లకొండ సాంబమూర్తి 2021లో గూడూరు పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు.
అప్పటి సీఐ రాజిరెడ్డి అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన మహబూబాబాద్ కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ బుధవారం 20 ఏండ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. కేసు విచారణలో సహకరించిన కోర్టు కానిస్టేబుల్స్నరేశ్, రమేశ్‌లను సీఐ అభినందించారు.