
డెలివరీకి పోతే ప్రాణం పోయింది..
డాక్టర్ల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ
డెడ్‌బాడీతో ఖమ్మం-వరంగల్ హైవేపై ఆందోళన
మరిపెడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామానికి చెందిన వడ్లూరి భాగ్యలక్ష్మి (25) అనే బాలింత మరిపెడ పీహెచ్సీ డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయిందని ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అనే గర్భిణి డెలివరీ కోసం సోమవారం మరిపెడ పీహెచ్సీలో జాయిన్ అయ్యింది. అక్కడి డాక్టర్ ఆమెకు చిన్న ఆపరేషన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ కాక హెల్త్ కండిషన్ సీరియస్ కావడంతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే భాగ్యలక్ష్మి చనిపోయినట్లు డాక్టర్స్ నిర్ధారించడంతో బంధువులు మరిపెడ పీహెచ్సీ వద్ద డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.
డాక్టర్ నిర్లక్ష్యంతో కుట్లు సరిగా వేయకపోవడం వల్ల ఓవర్ బ్లీడింగ్ తో చనిపోయిందని ఆరోపించారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆగ్రహంతో డెడ్‌బాడీని ఖమ్మం–వరంగల్ నేషనల్ హైవేపై వేసి ధర్నాకు దిగారు. ఘటనకు కారణమైన డాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, విచారణ జరిపి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని మూడు గంటలుగా ఆందోళన చేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు అదనపు బలగాల సహాయంతో ఆందోళనకారులను స్టేషన్ కు తరలించారు. డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ నవీన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీధర్ రావు, తహసీల్దార్ రాంప్రసాద్ బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.