సాయం కోసం ఎదురుచూపులు

సాయం కోసం ఎదురుచూపులు
  • రావిరాల, సీతారాంతండాలో సర్వం కోల్పోయిన ప్రజలు
  • నష్టాన్ని అంచనా వేసిన అధికారులు 
  •  వరద నష్టానికి గురైన వందల కుటుంబాలు

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలో భారీ వరదల వల్ల నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మండలం సీతారాం తండాలో ప్రజలు సర్వం కోల్పోయారు. బాధితులుగా మారిన వందకు పైగా కుటుంబాలు  సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో రెండు చెరువులు తెగిపోయి ఊరి మీదకు వరద వచ్చింది. దీంతో ఇండ్లు నీట మునిగాయి. సరుకులు, బట్టలు, ధాన్యం, నగదు, నగలు కొట్టుకుపోయాయి.బైక్​లు, కోళ్లు, గొర్రెలు, బర్రెలు, ఆటోలు సైతం కొట్టుకుపోయాయి. రావిరాల గ్రామంలో 133 కుటుంబాలు వరద నష్టానికి కు గురయ్యాయి. 131 గొర్రెలు, మేకలు, 2 బర్లు చనిపోయాయి.

10 ఇండ్లు కూలిపోగా.. 12 ఇండ్లు దెబ్బతిన్నాయి. 4890 కోళ్లు మృత్యువాతపడ్డాయి. మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామ శివారు సీతారాం తండాలో 56 కుటుంబాలు వరద నష్టానికి గురయ్యాయి. గొర్రెలు, మేకలు 12, పశువులు22, గృహల్లోని నిత్యవసర వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి.  మరిపెడ మండల పరిధిలో మొత్తం 293 కుటుంబాలు నష్టపోగా..  194  ఇండ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.  6500 ఎకరాల్లో పంటనష్టం కాగా, 89 జీవాలు, 22 పశువులు కోల్పోయారు. వరద నష్టాన్ని మండల అధికారులు అంచనా వేశారు. ఫైనల్​ రిపోర్టును జిల్లా ఆఫీసర్లకు పంపుతున్నట్లు తెలిపారు. కాగా మహబూబాబాద్​ ఎమ్మెల్యు డాక్టర్​ భూక్య మురళీనాయక్​, ప్రభుత్వ విప్​, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్​ ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వం సాయం అందించాలి 

భారీ వర్షంతో చెరువు లు తెగడం వల్ల మా ఇల్లు పూర్తిగా కూలిపోయింది. రెక్కల కష్టం మొత్తంగా మట్టిలో కలసిపోయింది. నిలువ నీడ లేకుండా పోయింది. కొత్త ఇల్లును మంజూరు చేయాలి. కట్టుబట్టలతో మిగిలిపోయాం. అధికారులు మా వివరాలను రాసుకున్నారు. ప్రభుత్వం అందించే పరిహరం అందించాలి,ప్రభుత్వ సహయం కోసం ఎదురు చూస్తున్నాం. 
- సీ.నరుసమ్మ, రావిరాల గ్రామం, నెల్లికుదురు మండలం

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

జిల్లాలో భారీ వరదల వల్ల కలిగిన నష్టాన్ని సీఎం రేవంత్​ రెడ్డి పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల వారీగా అధికారులు సర్వే చేశారు. పూర్తిగా నష్టపోయిన కుటుంబాలకు రూ.16500, పంటనష్టం ఎకరాకు రూ.10 వేలు, గొర్రెలు, మేకలు, గేదెలు చనిపోతే తగిన నష్టం అందిస్తాం. రిపోర్టులు చివరి దశకు వచ్చినట్టు ఆఫీసర్లు తెలిపారు. రిపోర్టు అందగానే   నేరుగా బాధితుల  ఎకౌంట్​లో నిధులు జమ చేస్తెంది.  ప్రజలు ఆందోళన చెందవద్దు.
- ప్రభుత్వ విప్​, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్​