అతలాకుతలం ఈదురు గాలులు, వడగండ్ల వానతో భారీనష్టం

అతలాకుతలం ఈదురు గాలులు, వడగండ్ల వానతో భారీనష్టం
  • కేసముద్రం_ మహబూబాబాద్​ రహదారిలో 50కి పైగా కూలిన చెట్లు
  • కల్వల_చిన్న ముప్పారం రోడ్లులోనూ భారీగా కూలిన వృక్షాలు
  • నేల రాలిన మామిడి కాయలు, తడిసిన ఇటుక తయారీ బట్టీలు
  • వరి, మొక్క జొన్న రైతులకు తీవ్ర నష్టం

మహబూబాబాద్ / నెల్లికుదురు/ కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి బలమైన ఈదురు గాలులు, అకాల వడగండ్ల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కేసముద్రం,  పూసపల్లి, మహబూబాబాద్​ రహదారిలో 50కి పైగా, కల్వల, చిన్న ముప్పారం రోడ్డులోనూ భారీగా  వృక్షాలు నేల కూలాయి. దీంతో రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు జేసీబీల సహయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు. ఈదురు గాలులు, రాళ్ల వర్షంతో జిల్లాలోని మహబూబాబాద్, నెల్లికుదురు, కేసముద్రం, కొత్తగూడ, తొర్రూరు మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. 

మామిడి కోత దశలో ఉండగా, ఆ పంటను నమ్ముకుని ఉన్న కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. తొర్రూరు, నెల్లికుదురు మండలాల్లో ఇటుకల తయారీదారులకు భారీగా నష్టం జరిగింది. నారాయణపురం శివారు చెరువు కొమ్ముతండా వద్ద విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ నేలకూలింది. జిల్లాలో 40 కి పైగా విద్యుత్​ స్తంభాలు విరిగిపోయాయి. కేసముద్రం మండలం కల్వల గ్రామంలో  ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొత్తగూడ మండలంలో గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలోని వాహన పూజ షెడ్​ కుప్పకూలింది. భూపతిపేట రోడ్డుపై, పాకాల చిలకమ్మ నగర్​ రోడ్డుపై భారీ చెట్లు పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

వరి,మొక్క రైతులకు తీవ్ర నష్టం..

వరి కోత దశకు చేరుకోగా వడగండ్ల వానతో వడ్లు రాలిపోయాయి. మొక్క జొన్న అనేక చోట్ల రాశులు పోసుకోగా, అకాల వర్షంతో తడిసిపోయాయి. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆఫీసర్లు గ్రామాల వారీగా పంట నష్టం పై ప్రాథమిక సర్వేను స్టార్ట్​ చేశారు. జిల్లాలో 38 గ్రామాల పరిధిలో 1685 రైతులకు చెందిన 2686 ఎకరాల్లో వరి పంట, 71 మంది రైతులకు చెందిన మొక్క జొన్న పంట130 ఎకరాల్లో , 140 మంది రైతులకు చెందిన 473 ఎకరాల మామిడి, ఇద్దరు రైతులకు చెందిన 2 ఎకరాల బొప్పాయి, ఇద్దరు రైతులకు చెందిన 4 ఎకరాల్లో సపోట పంటకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ నష్టం నెలకొన్నది.

కూలిన షెడ్డు..

నెక్కొండ : వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం గొట్లకొండ శివారు మామిడితోట తండాల్లో సోమవారం రాత్రి వచ్చిన గాలివాన బీభత్సవానికి మాలోతు ధలి, వెంకన్నకు చెందిన రైతుల గేదెల షెడ్డు నేలమట్టమైంది. ఈవిషయంపై తహసీల్దార్​ రాజ్​కుమార్​కు చెప్పాగా, కలెక్టర్​కు ఫైల్​పెడుతున్నట్లు తెలిపినట్లు చెప్పారు. 

మహబూబాబాద్​ అరటి తోట నేలమట్టం

వెంకటాపూర్ (రామప్ప) : ములుగు జిల్లా వెంకటాపూర్ కు చెందిన పిట్టల సురేశ్, పిట్టల నారాయణ పాలంపేట రోడ్ లోని కొగ్గాని కుంట పక్కనున్న పొలంలో మూడు ఎకరాల్లో అరటి తోట సాగు చేస్తున్నారు. భారీ ఈదురు గాలులకు చేతికొచ్చిన అరటి తోట పూర్తిగా నేలకూలింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు.

నల్లబెల్లి ఆగమాగం 

నల్లబెల్లి: నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో ఈదురు గాలులతో పంట నష్టం జరిగింది. నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు కొండాపురం, మూడు చెక్కలపల్లిలో కరెంటు పోల్స్​విరిగిపడి పోవడంతో కటిక చీకట్లో గ్రామాలు ప్రజలు ఉన్నారు. మొక్కజొన్న పంటతో పాటు పలుచోట్ల షెడ్లు కుప్పకూలాయి.