మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు అన్ని పార్టీలు సహకరించాలని మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు కోరారు. మంగళవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో ఆ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఇరత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి త్వరలో నిర్వహించనున్న టీచర్స్ శాసన మండలి, పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని 482 గ్రామపంచాయతీలు, 4110 వార్డుల వారీగా ఓటరు జాబితా సవరణలు అభ్యంతరాలు గ్రామపంచాయతీ, వార్డు పోలింగ్ బూత్ ల వారీగా వివిధ అంశాలపై వారితో చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. రెండో ఓటరు సవరణ జాబితా ఓటరు సవరణలపై రేపు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 193 ఎంపీటీసీల స్థానాల వివరాల పై చర్చించారు.
జనగామ కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అడిషనల్ కలెక్టర్లు పింకేశ్కుమార్, రోహిత్ సింగ్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 995 మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ సముదాయంలోని ప్రధాన ఈవీఎం గోడౌన్ను ఆయన తనిఖీ చేశారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మండల నియంత్రణ పద్దతులను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.