మహబూబాబాద్‌లో గత ఆదివారం కిడ్నాప్ అయిన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ మిస్టరీ విషాదాంతంగా ముగిసింది. కిడ్నాపర్లు బాలుడిని చంపి శనిగపురం గుట్టల్లో పెట్రలో పోసి దహనం చేశారు. అయితే తెలిసినవారే ఈ పని చేసినట్లుగా పోలీసులు తేల్చారు. బాలుడి బంధువులైన మనోజ్ రెడ్డి, సాగర్‌లను పోలీసులు అదుపులోకి తీసకొని విచారించారు. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లి క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పాత వివాదాల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు అంటున్నారు.
వసంత, రంజిత్‌ల కుమారుడైన దీక్షిత్‌ను గత ఆదివారం కిడ్నాప్ చేసిన నిందితులు.. బాలుడి విడిచిపెట్టాలంటే రూ. 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే డబ్బులు డిమాండ్ చేయడానికి ముందే నిందితులు బాలుడిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని చంపి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. కాగా.. గురువారం ఉదయం మహబూబాబాద్ శివారులోని అన్నారం గ్రామ సమీపంలోని గుట్టల్లో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడిని చంపిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పటించినట్లు తెలుస్తోంది. దీక్షిత్ మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.