అధికారులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్

అధికారులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్

మహబూబాబాద్: పట్టణంలో నూతనంగా నిర్మిస్తోన్న నర్సింగ్, మెడికల్ కళాశాల పనులను స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కాకముందు తాను ఇంజనీర్ నని, తనకు వాస్తు తెలుసునన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్... వాస్తు ప్రకారం కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. లేకుంటే భవనం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిజాం రాజులు ఏ విధంగానైతే నిర్మాణాలు చేపట్టారో... అదే విధంగా బిల్డింగ్ కట్టాలన్నారు.

ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అధికారులు తన మాటను లెక్క చేయడం లేదని సీరియస్ అయిన ఎమ్మెల్యే... తీరు మార్చుకోకుంటే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇకపోతే... తమని అధికారులని కూడా చూడకుండా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని సంబంధిత అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.