బెట్టింగ్‌‌‌‌ల కోసం చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌లు

బెట్టింగ్‌‌‌‌ల కోసం చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌లు
  • యువకుడిని అరెస్ట్‌‌‌‌ చేసిన మహబూబాద్‌‌‌‌ పోలీసులు
  • రూ. 16.94 లక్షల విలువైన 22.4 తులాల బంగారం, బైక్‌‌‌‌, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్వాధీనం

మహబూబాబాద్, వెలుగు : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌లో పోగొట్టుకున్న డబ్బులు రాబట్టుకోవడంతో పాటు, మళ్లీ బెట్టింగ్‌‌‌‌లు పెట్టేందుకు చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌లు చేస్తున్న ఓ యువకుడిని మహబూబాబాద్‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్‌‌‌‌ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌ శుక్రవారం వెల్లడించారు. బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఆంగోతు విక్రమ్‌‌‌‌ డ్రిల్లింగ్‌‌‌‌ మిషన్‌‌‌‌ పని చేస్తుంటాడు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌లకు అలవాడు పడి డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఆ డబ్బులు సంపాదించుకోవడంతో పాటు, తిరిగి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌లు పెట్టేందుకు చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాల్లో బైక్‌‌‌‌పై తిరుగుతూ ఒంటరిగా కనిపించే మహిళల మెడలోంచి బంగారు చైన్లు లాక్కెళ్లేవాడు. ఇలా ఇప్పటివరకు మహబూబాబాద్‌‌‌‌ పట్టణంలో 4, ఖమ్మం పట్టణంలో 7 చోరీలు చేశాడు. దొంగిలించిన వస్తువులను అమ్మేందుకు బైక్‌‌‌‌పై మహబూబాబాద్‌‌‌‌ వైపు వస్తుండగా ఇల్లందు రోడ్‌‌‌‌ ఆర్తి గార్డెన్‌‌‌‌ వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా చోరీల విషయం వెలుగు చూసింది.

మొత్తం రూ. 16.94 విలువైన బంగారు వస్తువులతో పాటు బైక్‌‌‌‌, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్వాధీనం చేసుకొని అతడిని అరెస్ట్‌‌‌‌ చేశామని ఎస్పీ తెలిపారు. విక్రమ్‌‌‌‌పై పీడీ యాక్ట్‌‌‌‌ నమోదు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ తిరుపతిరావు, టౌన్‌‌‌‌ సీఐ పి.దేవేందర్, సీసీఎస్‌‌‌‌ సీఐ హతీరాం నాయక్, ఎస్సైలు తాహెర్‌‌‌‌బాబా, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ పాల్గొన్నారు.