నర్సింహులపేట మండలలో సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ము రికవరీ

నర్సింహులపేట మండలలో సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ము రికవరీ

నర్సింహులపేట, వెలుగు: మూడు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలలో కేంద్రంలో ఎస్బీఐ మినీ  బ్యాంక్ నిర్వహకుని వద్ద సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బులు బాధితుడికి పోలీసులు అందజేశారు.  ఎస్సై మాలోతు సురేశ్ వివరాల ప్రకారం మండలంలోని పాండ్య తండాకు చెందిన గుగులోతు రమేశ్ గత సంవత్సరం డిసెంబర్ 13న సైబర్ నేరగాళ్ల వలలో  పడి రూ. 80 వేలు పోగొట్టుకున్నాడు.

మినీ బ్యాంక్ నిర్వహకుడుని సైబర్ మోసగాడు తన పేరు భాస్కర్ రావని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై విధులు నిర్వహిస్తున్ననని ఎస్సై కూతురు ఆరోగ్యం బాగాలేదని తన మనిషిని బ్యాంక్ వద్దకు పంపిస్తాను రూ. 80 వేలు క్యాష్ తీసుకుని ఫోన్ పే చేయాలని చెప్పాడు. దీంతో రమేశ్ తాను హైదరాబాద్ లో ఉండి తన వర్కర్ తో  రూ. 30 వేలు,రూ. 50 వేలు మొత్తం రూ. 80 వేలు ఫోన్ పే చేయించాడు.

ఎంతకీ డబ్బులు తీసుకుని రాకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరా తీయగా భాస్కర్ రావు లాంటి వారు ఎవరూ లేరని  తెలపడంతో తాను మోసపోయానని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ నేరస్థుడి అకౌంట్ ఫ్రీజ్ చేసి డబ్బులను బాధితుడి  అకౌంట్ కు బదిలీ చేశామని ఎస్సై చెప్పారు. సైబర్ నేరాల బారిన పడితే 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలని ఎస్సై తెలియజేశారు.