రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. పోలీసులకు సవాల్​గా మారుతున్న అక్రమ రవాణా

రెచ్చిపోతున్న  ఇసుక మాఫియా.. పోలీసులకు సవాల్​గా మారుతున్న అక్రమ రవాణా
  • ఆకేరు వాగు వద్ద పోలీస్​చెక్​పోస్ట్​ టెంట్​ను దగ్ధం చేసిన దుండగులు
  • మధ్యాహ్నం వేలలోనే యథేచ్ఛగా తరలింపు
  • పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల ప్రేక్షక పాత్రపై విమర్శలు

మహబూబాబాద్, వెలుగు: ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు, పాలేరు వాగుల నుంచి అక్రమ ఇసుక రవాణా నిరోధం కోసం జిల్లా పోలీసులు పది చోట్ల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​కేకన్​ ఆధ్వర్యంలో పోలీసులు వాగుల వెంట పర్యటించి చెక్​పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఇటీవల పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల పై రాజకీయ నాయకుల ఒత్తిడి పెరగడంతో ఇసుక అక్రమ రవాణా పై సడలింపు ధోరణి అవలంభిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని చిన్నగూడూరు మండల సమీపంలో ఆకేరు వాగు ఒడ్డున ఏర్పాటు చేసిన పోలీస్ చెక్​పోస్టును గత బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించారు.

దీంతో పోలీస్​టెంట్​పూర్తిగా కాలిపోయింది. ఆనవాళ్లు కనిపించకుండా ఆ ప్రదేశంలో ఇసుక చల్లడంతో, ఇసుక మాఫియా పనేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పోలీసులు మాత్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

సీసీ రోడ్ల నిర్మాణం పేరుతో రవాణా..

గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలనే కారణంతో అక్రమ ఇసుక దందా మళ్లీ మొదలైంది. జిల్లా, మండల రెవెన్యూ ఆఫీసర్లు, మైనింగ్ ఆఫీసర్లు అధికారికంగా ఎటువంటి ఇసుక తరలింపు అనుమతులు జారీ చేయనప్పటికీ ఇసుక తరలింపు దారులు తాము ప్రభుత్వ సీసీ రోడ్ల నిర్మాణాల కోసమే ఇసుక తరలిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఉదయం, రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల జేసీబీల సాయంతో ఇసుక ట్రాక్టర్లను నింపుతున్నారు.

రాజకీయ ఒత్తిళ్లతో ఆఫీసర్ల ప్రేక్షక పాత్ర..

పోలీసు, రెవెన్యూ ఆఫీసర్లు ఇసుక అక్రమ రవాణా పై ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలుత ఉక్కు పాదం మోపినప్పటికీ, గ్రామాల్లోని అధికార పార్టీ లీడర్లు ఆయా పార్టీ నేతలపై ఒత్తిడి పెంచడంతో అక్రమ ఇసుక రవాణాపై చూసీ చూడనట్లుగా ఉండాలనే ఆదేశాలు గట్టిగా రావడంతోనే  పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి. ఇన్ని రోజులుగా కట్టడి చేసినప్పటికీ ఒకేసారి పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా మరింతగా రెచ్చిపోయి అక్రమ ఇసుక తరలింపు కొనసాగిస్తున్నారు.

పోలీస్​ చెక్ పోస్ట్ టెంటును కాల్చిన దుండగులు..

మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు శివారులో ఏర్పాటు చేసిన పోలీస్​ చెక్ పోస్టు టెంట్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఆకేరు వాగు పక్కన ఏర్పాటు చేసిన పోలీస్​చెక్ పోస్టు టెంటుకు నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయింది. టెంట్ ఆనవాళ్లు లేకుండా కాలిన ప్రదేశంలో ఇసుక చల్లారు. గత బుధవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉండవచ్చని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో టెంటుల కింద డ్యూటీలు చేయాలంటే పోలీస్, రెవెన్యూ సిబ్బంది జంకుతున్నారు. టెంటు కాల్చిన దుండగులను పట్టుకునే పనిలో చిన్నగూడురు పోలీసులు నిమగ్నమయ్యారు.