సిట్టింగుల్లో టెన్షన్.. మారుతున్న పొలిటికల్​ ఈక్వేషన్స్​

సిట్టింగుల్లో టెన్షన్.. మారుతున్న పొలిటికల్​ ఈక్వేషన్స్​
  • పబ్లిక్​కు దగ్గరయ్యేందుకు అధికార పార్టీ  ఎమ్మెల్యేల పాట్లు
  • నాలుగు స్థానాల్లో హైకమాండ్​ క్యాండిడేట్లను మార్చుతోందని పబ్లిక్​లో టాక్

మహబూబ్​నగర్, వెలుగు: మారుతున్న రాజకీయ పరిణామాలతో పాలమూరు సిట్టింగ్​ ఎమ్మెల్యేలు టెన్షన్​​ పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతినేతలు తిరుగుబాటు చేస్తుండగా, మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని క్యాడర్​ గుర్రుగా ఉందని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కింద కొందరు సిట్టింగులు సర్వేలు చేయించుకున్నారు. కొన్నిచోట్ల నెగటివ్ రిజల్ట్స్,  కొన్ని స్థానాల్లో టఫ్​ ఫైట్​ జరుగుతోందని తేలడంతో టెన్షన్​ పడుతున్నారు. దీనికితోడు ఉమ్మడి జిల్లాలోని నాలుగు స్థానాల్లో ఇదివరకు ప్రకటించిన క్యాండిడేట్లను మార్చాలని హైకమాండ్​ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సిట్టింగులను భయపెడుతోంది.

చీలిపోయిన క్యాడర్..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 సెగ్మెంట్లలో సిట్టింగులకే మళ్లీ చాన్స్​ ఇస్తున్నట్లు కేసీఆర్​ ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ క్యాడర్​ చీలిపోతోంది. టికెట్లు ఆశించిన సెకండ్​ క్యాడర్​ లీడర్లు సీఎం ప్రకటన వచ్చేంత వరకు వెయిట్​ చేసి ఇప్పుడు కండువాలు మార్చేసుకుంటున్నారు. ఇతర పార్టీల హైకమాండ్​ వద్ద టికెట్ల కోసం పైరవీలు ప్రారంభించారు. అసమ్మతినేతలు నియోజకవర్గాల్లో చక్రం తిప్పే లీడర్లు కావడం,  ప్రజా బలంతో పాటు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలను శాసించగలిగే సత్తా ఉండడం, ఫైనాన్షియల్​ సపోర్ట్​ ఫుల్​గా ఉండడంతో  గద్వాల, వనపర్తి, మక్తల్, కల్వకుర్తి, జడ్చర్ల సెగ్మెంట్లలో సిట్టింగులకు కంటి మీద కనుకు లేకుండా పోతుంది. 

నియోజకవర్గ కేంద్రాలపై పట్టు కోసం..

గెలిచిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాలను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఎలక్షన్లు రావడంతో వీరికి దగ్గరయ్యేందుకు ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల ఓ ఎమ్మెల్యే తన బర్త్​డే సెల్రబేషన్స్​ను నియోజకవర్గ కేంద్రంలో జరుపుకున్నారు.

సర్వే ఫీవర్..

బీఆర్ఎస్​ హైకమాండ్​ ఎలక్షన్​ ఇయర్​ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి నెలా పబ్లిక్​లో పార్టీ పరిస్థితి, సిట్టింగుల పనితీరుపై సర్వేలు చేయిస్తోంది. దీన్ని ఇటీవల 15 రోజులకోసారి చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇంటెలిజెన్స్​తో పాటు సర్వే టీంల ద్వారా రిపోర్ట్​ను తెప్పించుకుంటోంది. తాజాగా ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేల్లో కొన్ని నియోజకవర్గాల్లో టఫ్​ ఫైట్​ జరుగుతుందని, మరికొన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్లపై వ్యతిరేకత వస్తోందనే రిపోర్టులు హైకమాండ్​కు చేరినట్లు తెలిసింది. ప్రధానంగా నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ పరిధిలో మూడు చోట్ల, పాలమూరు పార్లమెంట్​ పరిధిలో ఒక చోట క్యాండిడేట్లను మార్చే చాన్స్​ ఉన్నట్లు టాక్​ నడుస్తోంది.