పాలమూరుకు మరో బై పాస్! కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి

పాలమూరుకు మరో బై పాస్! కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి
  • సానుకూలంగా స్పందించిన మంత్రి
  • అప్పన్నపల్లి, నవాబ్​పేట, హన్వాడ మండలాల మీదుగా బై పాస్​కు ప్రపోజల్స్

మహబూబ్​నగర్, వెలుగు: నేషనల్​ హైవే 167 (మహబూబ్​నగర్,​-చించోలి), నేషనల్​ హైవే 167 ఎన్(మహబూబ్​నగర్,​-రాయచూర్​ సెక్షన్)తో ట్రాఫిక్​ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాలమూరు పట్టణం లోపలి నుంచే ఈ హైవే వెళ్లడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్​ జామ్​ ఏర్పడుతోంది. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీ డీకే అరుణ సహకారంతో కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీని కలిశారు. ఈ రెండు జాతీయ రహదారులకు అనుబంధంగా నేషనల్​ హైవే డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​ కింద బై పాస్​ రోడ్డు మంజూరు చేయాలని కోరగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. 

యాక్సిడెంట్లు.. ట్రాఫిక్​ తిప్పలు..

ఎన్​హెచ్​ 167 కర్నాటకలోని హగరి నుంచి మొదలవుతుంది. ఏపీలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం మీదుగా మళ్లీ కర్నాటకలోని రాయచూరు నుంచి తెలంగాణలోని మక్తల్, మహబూబ్​నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, నిడమనూరు, మిర్యాలగూడ, హుజూర్​నగర్, కోదాడ వరకు 483 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో కర్నాటకలో 55 కిలోమీటర్లు, ఏపీలో 99.15 కిలోమీటర్లు, తెలంగాణలో అత్యధికంగా 321.88 కిలోమీటర్ల పొడవునా ఈ హైవే ఉంది. 

ఎన్​హెచ్​-167(ఎన్) భూత్పూరు నుంచి మహబూబ్​నగర్​ వయా హన్వాడ, గండీడ్​, కోస్గి మీదుగా చించోలి వరకు 107 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ హైవే కింద రోడ్డు విస్తరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. అయితే  మహబూబ్​నగర్​ పట్టణం మీదుగా ఈ రెండు హైవేలు ఉండడంతో ట్రాఫిక్​ విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం మెట్టుగడ్డ, వన్​టౌన్, న్యూ టౌన్, బస్టాండ్​ చౌరస్తా, పద్మావతి కాలని, టీడీ గుట్ట, బోయపల్లి, పాత బస్టాండ్, అశోక్​ టాకీస్, పాత పాలమూరు, భగీరథ కాలనీ, బండమీదిపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్​ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికితోడు రాత్రిళ్లు భారీ వాహనాలు వెళ్తుండటం, పట్టణంలో ఆ వాహనాలను నిలుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

 కొద్ది రోజుల కిందట న్యూ​ టౌన్​ ఏరియాలో తెల్లవారుజామున హైవే-167పై ఆగి ఉన్న డీఎంసీను బైక్​ ఢీ కొట్టడంతో మెడిసిన్​ చదువుకుంటున్న ఇద్దరు స్టూడెంట్లు స్పాట్​లోనే చనిపోయారు. ఇటీవల రూరల్​ మండలం మన్యంకొండ వద్ద తెల్లవారుజామున బైక్​ పై వెళ్తున్న అన్నదమ్ములను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అన్న స్పాట్​లోనే చనిపోగా.. తమ్ముడికి కాలు విరిగింది. ట్రాఫిక్​ సమస్యతో పాటు యాక్సిడెంట్లు పెరుగుతుండడంతో ఈ హైవేపై బై పాస్​ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. 

నామినల్​ సర్వే పూర్తి..

పాలమూరులో కొత్త బై పాస్​ ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు కొద్ది రోజుల కింద నామినల్​ సర్వే చేసినట్లు తెలిసింది. హైవేల నుంచి హెవీ వెహికిల్స్​ పట్టణంలోకి రాకుండా.. ఓ రూట్​ మ్యాప్​ను తయారు చేసినట్లు సమాచారం. దాని ప్రకారం మహబూబ్​నగర్​ మున్సిపాల్టీలోని అప్పన్నపల్లి నుంచి కొత్త బై పాస్​ రోడ్డు ఏర్పాటు చేసేలా డిజైన్​ చేశారు. అక్కడి నుంచి నవాబ్​పేట మండలం మీదుగా హన్వాడ మండలంలోని చిన్నదర్పల్లి వద్ద ఎన్​హెచ్​-167 (ఎన్)కు లింక్​ కలిపేలా ప్లాన్ చేశారు.

ఇప్పటికే రెండు బై పాస్​లు..

మహబూబ్​నగర్​లో ఇప్పటికే రెండు బై పాస్​ రోడ్లు మంజూరయ్యాయి. అందులో ఒకటి మహబూబ్​నగర్, ​-జడ్చర్ల రోడ్డు  మీదుగా పిస్తా హౌస్​ నుంచి మొదలై భూత్పూర్,​-మహబూబ్​నగర్​ మెయిన్​ రోడ్డుకు అనుసంధానం చేశారు. ఈ పనులు పూర్తి కాగా.. ఈ బై పాస్​ అందుబాటులోకి వచ్చింది. మరో బై పాస్​ భూత్పూర్,​ -మహబూబ్​నగర్​ మెయిన్​ రోడ్డు క్రిస్టియన్​పల్లి నుంచి ప్రారంభమై.. పాలమూరు యూనివర్సిటీ, వీరన్నపేట, చిన్నదర్పల్లికి అనుసంధానం చేస్తున్నారు. ఈ బై పాస్​ పనులు ఇంకా సాగుతున్నాయి.

బై పాస్​ ఏర్పాటుకు హామీ ఇచ్చారు..

ఎన్​హెచ్​-167 హైవే మీద బై పాస్​ కావాలని ఎమ్మెల్యే యెన్నంతో కలిసి కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీని కలిసి వినతిపత్రం ఇచ్చాం. బై పాస్​ పనులు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ బై పాస్ తో పట్టణ ప్రజల సమస్య తీరుతుంది.​     - డీకే అరుణ, ఎంపీ​

ఎండార్స్​మెంట్​ చేశారు..

మహబూబ్​నగర్​ ప్రజలు మరో బై పాస్​ను కోరుతున్నారు. పాలమూరుకు సర్క్యులర్​ రింగ్  రోడ్డు వస్తే పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా.. బయటి నుంచే వెళ్లిపోతాయి. దీంతో ట్రాఫిక్​ సమస్య తప్పుతుంది. అప్పన్నపల్లి నుంచి చిన్నదర్పల్లి వరకు బై పాస్​ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇవ్వగా.. ఆయన ఎండార్స్​మెంట్​ కూడా చేశారు. యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే