జడ్చర్ల టౌన్/ మహబూబ్‌నగర్‌రూరల్, వెలుగు: ఫిల్టర్ ఇసుక తయారు చేసుందుకు అక్రమార్కులు వాగులను చెరబడుతున్నారు. దందా మొత్తం రూలింగ్పార్టీ లీడర్ల కనుసన్నల్లో నడుస్తుండడంతో ఆఫీసర్లు అడ్డు చెప్పడం లేదు. నియోజకవర్గ స్థాయి లీడర్లు అండగా నిలుస్తున్నారు. వీరి మట్టి తవ్వకాలవల్ల వాగులు ఆనవాళ్లు కోల్పోయి, వాగుల పొంటి ఉన్న చెక్‌డ్యాములు కూలిపోతున్నయ్. మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ, గండీడ్, నవాబ్‌పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్ మండలాల్లో వాగులు ఉన్నాయి. ఇందులో దుందుభి వాగు నవాబ్‌పేట మండలం నుంచి స్టార్టయి జడ్చర్ల నియోజకవర్గం మొత్తం పారుతుంది. ఇప్పటికే ఈ వాగులో పెద్ద మొత్తంలో ఇసుక తవ్వకాలు జరగడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. సాగునీటికి ఇబ్బంది కలుగుతోందని రైతులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఇసుక అక్రమ రవాణాకు బ్రేకులు పడ్డాయి.
ఈ క్రమంలో వ్యాపారులు ఫిల్టర్ఇసుకను తయారు చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని దుందుభి, మీనాంబరం వాగులతో పాటు మహబూబ్ నగర్రూరల్మండలంలోని కోటకదిర వాగు, గండీడ్ మండలంలోని అన్నారెడ్డిపల్లి వాగుల నుంచి జేసీబీలతో పెద్ద మొత్తంలో మట్టిని తవ్వుతున్నారు. అక్కడి నుంచి ఫిల్టర్ బెడ్స్వద్దకు మట్టి తరలించి, కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. కూలుతున్న చెక్‌డ్యామ్‌లు వాగుల పొంటి పెద్ద మొత్తంలో మట్టిని తీస్తుండటంతో దాని ప్రభావం చెక్‌డ్యామ్ లపై పడుతోంది. రూల్స్ ప్రకారం వాగుల్లో మూడు ఫీట్ల వరకే మట్టి లేదా ఓండ్రును తోడాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా 5 నుంచి 10 ఫీట్ల లోతు వరకు మట్టి తోడుతున్నారు. దీంతో మీనాంబరం వాగు కింద నవాబ్‌పేట మండలం కారూరు శివారులోని చెక్‌డ్యామ్ ధ్వంసమైంది. ఈ చెక్‌డ్యామ్ దిగువన ఉన్న మరో చెక్ డ్యామ్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. అలాగే దొడ్డిపల్లి శివారులోకి చెక్‌డ్యామ్ డ్యామేజ్అయ్యింది. కోటకదిర వాగుపై ఉన్న చెక్‌డ్యామ్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రానున్న వర్షాకాలంలో ఈ చెక్‌డ్యామ్‌ల పరిధిలో నీటిని నిల్వ ఉంచే పరిస్థితి కనిపించడం లేదు.
68 వేల ఎకరాలపై ఎఫెక్ట్..
ఈ ఏడు మండలాల్లో వాగుల ఆధారంగా యాసంగిలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.కాలువలు లేకపోవడంతో అందరూ బోర్లు వేసుకున్నారు. దాదాపు 68 ఎకరాలకుపైగా పంటలు సాగు చేస్తున్నారు.ఇందులో మెజార్టీగా వరి పంటనే వేసిర్రు. ప్రస్తుతం వాగుల్లో మట్టి తోడుతుండటంతో గ్రౌండ్‌వాటర్ తగ్గుతోంది. ఇప్పటికే బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట మండలాల్లో బోర్లు నీళ్లు పోస్తలేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరికి ఇంకో పది రోజులు సాగునీరు అవసరమవుతుంది.
దొంగ కరెంట్ వాడుతున్నారు..
మట్టి నుంచి ఇసుకను తీసేందుకు హన్వాడ, గండీడ్ మండలాల్లో ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేశారు. కానీ నవాబ్‌పేట, జడ్చర్ల, మహబూబ్నగర్రూరల్మండలాల్లో మట్టిని తవ్విన చోటే ఫిల్టర్‌చేసి ఇసుకను తయారు చేస్తున్నారు. ఇందుకు వాగుల వద్దే బోర్ మోటార్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. మోటార్లను రన్చేసేందుకు ఎలక్ర్టిసిటీ డిపార్ట్‌మెంట్‌నుంచి అనుమతులు తీసుకోకుండా దొంగతనంగా కరెంటు వాడుతున్నారు. ముందుగా జేసీబీలతో మట్టిని తీసి ట్రాక్టర్ ట్రాలీల్లో నింపుతున్నారు. అనంతరం బోర్లు ఆన్‌చేసి 5 ఇంచుల పైపులతో మట్టి ఫిల్టర్‌చేసి, ఇసుక తయారు చేస్తున్నారు.
నా పొలంలో మట్టి తీస్తుండ్రు..
మీనాంభరం వాగును ఆనుకొని నాకు పట్టా పొలం ఉంది. కారూర్, తిరుమలాపూర్ గ్రామాలకు చెందిన మనుషులు నా పొలంలోకి వచ్చి మట్టి తవ్వుతుండ్రు. ఎందుకు తవ్వుతుర్రని అడిగితే, నన్నే బెదిరిస్తుండ్రు. ఎవరికి చెప్పుకుంటావో చేప్పుకో అంటుర్రు. జంగయ్య, రైతు, కారూర్గ్రామం, నవాబ్‌పేట మండలం