మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే నుంచి ప్రారంభించనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం నుంచి గ్రామాలు, వార్డుల్లో అధికారులు పర్యటిస్తారని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సర్వే, జాబితా తయారీని పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వాములను చేయాలని చెప్పారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల గుర్తింపు విషయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు పాల్గొన్నారు.
నేడు సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై గురువారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీటింగ్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యలే, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.