సమగ్ర సర్వేపై విపక్షాలది అనవసర రాద్దాంతం: ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

సమగ్ర సర్వేపై విపక్షాలది అనవసర రాద్దాంతం:  ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

పాలమూరు, వెలుగు: సమగ్ర సర్వేపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, భవిష్యత్ తరాలకు ఈ సర్వే ఎంతో అవసరమని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్  కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అయోమయం అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో భాగ్యస్వాములై సహకరించాలని కోరారు. బీఆర్ఎస్  అధికారంలో ఉన్న సమయంలో సకల జనుల సర్వే చేపట్టి కనీసం రిపోర్టును కూడా బయటపెట్టలేదని పేర్కొన్నారు. పదేండ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్  అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, త్వరలో అరెస్ట్​ అవుతాననే భయంతో కేటీఆర్  కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

కేటీఆర్ ను పట్టించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, ఆయన పాదయాత్రతో ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి రాజకీయ అజ్ఞాని అని సీఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, ఆరు నెలల్లో సీఎం మార్పు అంటూ చేసిన వ్యాఖ్యలు అవగాహన లేమికి నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీలో వర్గ పోరు నుంచి దృష్టి మరలించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు ఆఫీస్​ ఆవరణలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డితో కలిసి పార్టీ నాయకులకు సమగ్ర సర్వేపై దిశానిర్దేశం చేశారు. టీజీఎంఎఫ్ సీ  చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్, నాయకులు సంజీవ్  ముదిరాజ్, వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, బెక్కరి అనిత, జహీర్  అక్తర్, అజ్మత్అలీ, సీజే బెనహర్ పాల్గొన్నారు.