పాలమూరుకు భగీరథ నీళ్లు బంద్​

పాలమూరుకు భగీరథ నీళ్లు బంద్​

పాలమూరుకు భగీరథ నీళ్లు బంద్​
వారం రోజులుగా నిలిచిన సరఫరా
వనపర్తి జిల్లాకు నీళ్లిచ్చేందుకు గౌరిదేవిపల్లి వద్ద సంపునకు గండి
పాలమూరుకు నీళ్లు వచ్చే పైపులైన్ మూసివేత
అనేక ఏరియాలకు అందని తాగునీరు

మహబూబ్​నగర్, వెలుగు : మహబూబ్​నగర్ జిల్లా కేంద్రానికి వారం రోజలుగా భగీరథ నీళ్లు బందయ్యాయి. మంత్రి నిరంజన్​రెడ్డి ఆదేశాలతో వనపర్తి జిల్లాకు అదనపు నీటిని కేటాయించే పనులు జరుగుతుండటంతో, ఆరు రోజులుగా పాలమూరు వచ్చే పైపులైన్​కు సప్లై బంద్​పెట్టారు. దీంతో మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాలకు  తాగునీటి సరఫరా నిలిచిపోయి, జనం అల్లాడుతున్నారు. పలుచోట్ల వాటర్​ కోసం పబ్లిక్​ఆందోళనకు దిగుతున్నారు. 

ఒక లైన్​ కంప్లీట్ షట్​డౌన్​

ఎల్లూరు నుంచి మహబూబ్​నగర్​వచ్చే భగీరథ మెయిన్​పైపు లైన్ వనపర్తి జిల్లా గౌరీదేవిపల్లి వద్ద ఉన్న రా వాటర్​స్టోరేజ్​సంపుతో లింక్ అయి ఉంది. ఇక్కడి నుంచి రెండు లింక్​ల ద్వారా పాలమూరుకు నీటి సరఫరా జరుగుతోంది. ఇదే పాయింట్ నుంచి వనపర్తి జిల్లా తాగునీటి అవసరాల కోసం అదనపు పైపులైన్​ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సంపులో రెండు మీటర్ల కాంక్రీట్​ను తొలగించి, హోల్​తవ్వారు.  ఇక్కడే మరో పైపులైన్​కలిపి వనపర్తికి నీటి సప్లై చేయనున్నారు. ఈ క్రమంలో పాలమూరు జిల్లాకు డిసెంబరు 29 మధ్యాహ్నం నుంచి ఒక లైన్​ షట్​డౌన్​ చేశారు. మరో లైన్​ ద్వారా 50 శాతం నీటిని మాత్రమే సప్లై చేస్తున్నారు. ఈ పనులు ఈ నెల 8 దాకా కొనసాగే అవకాశం ఉన్నట్లు భగీరథ ఆఫీసర్లు చెబుతున్నారు. అంత వరకు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా వాస్తవం మరోలా ఉంది. జిల్లా మొత్తానికి 70 ఎంఎల్​డీ(మిలియన్​ లీటర్స్​పర్​డే) నీళ్లు అవసరం కాగా,  జడ్చర్లకు 7‌‌‌‌‌‌‌‌.5, పాలమూరుకు 12.5 ఎంఎల్​డీ మాత్రమే సప్లై చేస్తున్నారు. దీంతో ప్రెజర్ చాలక పైపులైన్​ డౌన్​లో ఉన్న ఏరియాలకు తప్ప, ఎత్తయిన ప్రాంతాలకు ఐదారు రోజులుగా నీటి సరఫరా జరగడం లేదు. మహబూబ్​నగర్ మున్సిపాల్టీ పరిధిలోని హౌసింగ్​బోర్డు, ఏనుగొండ, అప్పన్నపల్లి, ఎదిర, పాత పాలమూరు, శివశక్తినగర్, వీరన్నపేట, టీడీగుట్ట, మర్లు, శ్రీనివాసకాలనీ, వేంకటేశ్వరకాలనీ, పద్మావతి కాలనీ, కొత్తగంజ్, సింహగిరి, సంజయ్​నగర్​, కొత్తచెర్వు రోడ్డు, హనుమాన్​నగర్, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావిగడ్డ, వాల్మీకినగర్, శాంతినగర్, గంజ్​ ఏరియా, రామా టాకీస్, ఎల్​బీ స్ట్రీట్, కావేరమ్మపేట, సరస్వతీ నగర్ కాలనీ, నల్లకుంట ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి గోస పడుతున్నారు. బాలానగర్, నవాబ్​పేట, మిడ్జిల్, మూసాపేట, దేవరకద్ర ఏరియాల్లో గ్రామ పంచాయతీ బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. రెండు రోజుల కింద అడ్డాకుల మండలం మొత్తానికి నీళ్లు సరఫరా కాకపోవడంతో ప్రజలు వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకున్నారు. 

ట్యాంకర్లను తెప్పించుకుంటుండ్రు

ఇంటి అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో కాలనీల్లో ప్రజలు బోర్లపైనే ఆధారపడుతున్నారు. బోర్ల సౌలత్​లేని ఏరియాల్లో ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్​కు  రూ.600 నుంచి రూ.800 చెల్లిస్తున్నారు. తాగేందుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెట్టి వాటర్ క్యాన్లు కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాగా, భగీరథ పనుల గురించి మున్సిపల్​ఆఫీసర్లు జనానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. రోజుల తరబడి నీళ్లు రాకపోవడంతో బోరు నీటినే తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరన్నా నీళ్లిస్తేనే స్నానాలు

నీళ్లు ఎందుకు వస్తలేవో ఎవరూ చెప్తలేరు. పొద్దున లేచిన వెంటనే మేము పనులకు పోతాం. ఆరు రోజులుగా ఉదయం పూట బోర్ల చుట్టూ తిరగడానికే టైం అయిపోతోంది. ఎవరో ఒకరు బోరు నీళ్లు ఇస్తే ఇంటి అవసరాలు, స్నానాలు చేయడానికి వాడుకుంటున్నాం. ఎప్పుడూ లేనిది ఇప్పుడు మంచినీళ్లను డబ్బులిచ్చి కొంటున్నాం.  
- శ్రీను, న్యూగంజ్​, మహబూబ్​నగర్​

తాగేందుకు నీళ్లే వస్తలేవు..

ఆరు రోజులుగా మా కాలనీకి తాగేందుకు మంచి నీళ్లు వస్తలేవు. బోరు నీళ్లనే వాడుకుంటున్నాం. ఈ నీళ్లతో వంటలు చేస్తే రుచి ఉంటలేవు. డబ్బున్న వాళ్లు ఫిల్టర్​ నీటిని తెచ్చుకుంటున్నారు. మా పరిస్థితి ఏమిటి? ఎన్ని రోజులు ఇట్లా మంచినీళ్లు లేకుండా ఉండాలె. బోరు నీళ్లు తాగితే గొంతు నొప్పి వస్తోంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలె? 
- జరీనా బేగం, సింహగిరి కాలనీ, మహబూబ్​నగర్​