వ్యాపారులు చెప్పిందే ధర...క్వింటాల్​కు రూ.2 వేలకు మించి ఇవ్వని వ్యాపారులు

వ్యాపారులు చెప్పిందే ధర...క్వింటాల్​కు రూ.2 వేలకు మించి ఇవ్వని వ్యాపారులు
  • మూడేండ్లుగా పాలమూరులో మార్క్​ఫెడ్​ ద్వారా కొనుగోళ్లు చేస్తలేరు

మహబూబ్​నగర్, వెలుగు :మక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటను అమ్ముకోవడానికి మార్కెట్లకు తీసుకొస్తే.. వ్యాపారులు వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కాకుండా.. తక్కువ ధరకు పంటను కొంటున్నారు. దీంతో పంటపై పెట్టిన పెట్టుబడులు రాక రైతులు నిలువునా మునిగిపోతున్నారు.

క్వింటాల్​కు రూ.2 వేలకు మించి ఇయ్యట్లే..

నిరుడు వానాకాలం సీజన్​లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మక్క చేలు ఎండిపోయాయి. చేసేది లేక రైతులు పంటను మొత్తం పశువులకు వదిలేశారు. ఈ సీజన్​లో వర్షాలు సమృద్ధిగా ఉంటాయని వాతావరణ శాఖ సూచించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల్లో రైతులు మక్క సాగు చేశారు. పంట చేతికి రావడంతో పది రోజుల నుంచి రైతులు కోతలు ప్రారంభించారు.

పంటను ఆరబెట్టి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మక్కలకు ప్రభుత్వం క్వింటాల్​కు మద్దతు ధర రూ.2,225 నిర్ణయించింది. కానీ, వ్యాపారులు మాత్రం రైతులకు ఆ మేరకు ధర ఇవ్వడం లేదు. పూర్తిగా ఎండిన మక్కలకు క్వింటాల్​కు రూ.1,900 నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు. తేమ ఉంటే ధర మరింత తగ్గిస్తున్నారు. అయితే ఈ ధరలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఎకరా మక్క సాగుకు దాదాపు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతుండగా.. వ్యాపారులు చెల్లిస్తున్న ధరతో పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు.

భారీగా తగ్గిన రేటు..

కోతలు ప్రారంభం కావడంతో పంట మార్కెట్లకు పెద్ద మొత్తంలో వస్తోంది. దీంతో రెండు రోజుల కింద వరకు క్వింటాల్​ మక్కలకు రూ.3 వేల వరకు ఉండగా, శుక్రవారం ధర పూర్తిగా పడిపోయింది. డిమాండ్​ తగ్గి ఉత్పత్తి పెరగడంతో రేటు తగ్గినట్లు మార్కెటింగ్​ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే దీని వల్ల రైతులు లాస్​ అవుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు వివిధ కారణాలు చెబుతూ ఎంఎస్​పీ కంటే తక్కువకు పంటను కొంటున్నారు.

ఇదిలాఉంటే ఇప్పటి వరకు మార్క్​ఫెడ్​ ద్వారా మక్కల కొనుగోళ్లను ప్రారంభించడం లేదు. గత మూడేండ్లుగా మార్కెట్​లో మక్కలకు మంచి రేట్​ వస్తోందని మార్క్​ఫెడ్​ ద్వారా కొనుగోళ్లు చేయలేదు. దీంతో వ్యాపారులు సీజన్​ మొదట్లో మార్కెట్​కు వచ్చే పంటకు ఎంఎస్​పీ కంటే ఎక్కువ రేట్​ చెల్లించి.. ఆ తరువాత వచ్చే పంటకు తక్కువ ధర చెల్లిస్తున్నారు.

దిగుబడి అంతంతే.. 

సాగుకు వాతావరణం అనుకూలించినా.. దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి మక్క కంకులకు వైరస్​ సోకింది. ఎకరాకు 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. 14 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దీనికితోడు అడవి పందుల బెడద వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు.


రూ.3 వేలు ఇస్తేనే లాభం..

నాకు రెండెకరాల పొలం ఉంది. విత్తనాలు, యూరియా, డీఏపీ, పిండి సంచులకు ఎకరానికి రూ.18 వేల వరకు ఖర్చు అయ్యింది. కంకులు పట్టాక.. అడవి పందులు చేనుపై పడ్డాయి. అర ఎకరా వరకు నాశనం చేశాయి. రెండు ఎకరాలకు 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 32 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. క్వింటాల్​కు రూ.3 వేలు ఇస్తే పెట్టుబడులు పోను కొంత లాభం వస్తుంది.కల్పన, మహిళా రైతు, నాయినోనిపల్లి