యాసంగి పంటలకు నీటి గోస

యాసంగి పంటలకు నీటి గోస
  • పగిలిన సరళాసాగర్ లిప్ట్ పైపులు–చివరి తడి కోసం రైతుల తిప్పలు

వనపర్తి, వెలుగు: యాసంగిలో సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకున్న సమయంలో చివరితడి అందించేందుకు  రైతులు తిప్పలు పడుతున్నారు. ఒక పక్క ఎండలు ముదరడం, మరోపక్క నీటి కొరత ఏర్పడడంతో రైతులకు కంటి మీద కునుకు కరువవుతోంది. ఇప్పటికే జూరాల, బీమా చివరి ఆయకట్టు పంటలు ఎండిపోయాయి. తాజాగా జిల్లాలోని మదనాపురం మండలం సరళాసాగర్  లిఫ్ట్​ మెయిన్​ పైప్ లైన్ పగిలిపోవడంతో పంపింగ్ నిలిచిపోయింది. 4,200 ఎకరాల ఆయకట్టు ఉన్న సరళాసాగర్ కింద మరో 15 రోజుల్లో పంట చేతికి రానుంది. ప్రస్తుతం నీటి మట్టం 8 అడుగులే ఉండడంతో తూముకు నీళ్లందక కాల్వలు పారడం లేదు. దీంతో మదనాపురం మండలం తిర్మలాయపల్లి, రామన్ పాడ్, నెల్విడి, నర్సింగాపూర్, దంతనూర్  గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతూ పంటలకు నీరు పారిస్తున్నారు. సరళాసాగర్ పైప్ లైన్  ధ్వంసం అయిన చోట పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలోని నెల్విడి, నర్సింగాపురం ఎత్తిపోతల లిఫ్ట్​కు ప్రభుత్వం రూ.15 కోట్లు ఖర్చు చేసింది.అయితే ఈ పథకం ఫెయిల్​ అయింది. గత సీజన్ లో పైప్ లైన్  ధ్వంసం కాగా, ఇప్పటి వరకు రిపేర్లు చేయలేదు. 3,600 ఎకరాలకు నీరందించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఈ సారి పంపింగ్ చేయకుండా మూలకు పడేశారు. ఇదిలాఉంటే సరళాసాగర్  లిఫ్ట్​ కూడా నెల్విడి స్కీం మాదిరిగానే అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

చివరి ఆయకట్టు రైతుల కష్టాలు...

జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్ గల్  మండలాల్లో బీమా, జూరాల కాల్వల చివరి ఆయకట్టుకు అధికారులు మార్చి 30 నుంచి నీటిని నిలిపివేయడంతో చేతికి వచ్చే దశలో పంటలు దెబ్బతిన్నాయి. సమీపంలో బోర్లు, బావులు ఉన్న వారు మాత్రం పంటలను కాపాడుకునేందుకు కిలోమీటర్ల మేర పైపులు వేసుకొని తడులు అందిస్తున్నారు. వరి, మినప, పెసర వంటి పంటలు రైతులు సాగుచేయగా, ఈ సారి నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. 

ప్రత్యామ్నయంగా నీరందిస్తున్నాం

పంటలు ఎండకుండా చర్యలు తీసుకుంటున్నాం. బోర్లు, బావులతో పాటు సమీపంలోని నీటిని మోటార్ల ద్వారా కాల్వలకు పంపింగ్  చేసి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నాం. పంట కోతల తర్వాత పైప్ లైన్  రిపేర్​ చేయిస్తాం. కరెంట్  తరచూ వస్తూ పోతుండడంతో ఒత్తిడితో పైప్​లైన్​ ధ్వంసమైంది. ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించి నిధులు తెప్పిస్తాం. - వెంకటయ్య, సరళాసాగర్ లిఫ్ట్, ప్రెసిడెంట్

పంటలు ఎండుతున్నాయ్..

సరళాసాగర్ కింద పంటలకు వారం రోజులుగా నీరందడం లేదు. వరి కంకి పాలు పట్టే దశలో కాల్వ బంద్  కావడంతో తీవ్రంగా నష్టపోతాం. సరళాసాగర్  లిఫ్ట్​ మెయింటెనెన్స్​లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పంప్ హౌస్  నిర్వహణ సరిగా లేకనే పైప్ లైన్ ధ్వంసమైంది. –వెంకటస్వామి, రైతు, తిర్మలాయపల్లి