మహబూబ్ నగర్, వెలుగు: జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి వద్ద పశు సంవర్థక శాఖకు చెందిన భూమిలో 10 ఎకరాలను కొత్త కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కోర్టు కాంప్లెక్స్ లో సరైన సవతులు లేక క్లయింట్లు, లాయర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన భూమి కేటాయిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 141 జారీ చేయించారు. దీంతో మంత్రి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
వెంకన్న సన్నిధిలో సేవ చేయడం అదృష్టం
హన్వాడ, వెలుగు : తిరుపతిలోని వెంకన్న సన్నిధిలో సేవ చేయడం అదృష్టమని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన శివ
రామాంజనేయ భజన మండలి బృందం ఆరోసారి తిరుపతి దేవస్థానంలో భజన మండలికి ఎంపికైంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి మంగళవారం భజన మండలి సభ్యులను పాలమూరుకు పిలిపించి సన్మానించారు. ఈ నెల 10న తిరుమలకు వెళ్లనున్నట్లు శివ రామాంజనేయ భజన మండలి అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి మంత్రికి తెలిపారు.
ఓటు నమోదులో తప్పులు రానివ్వొద్దు: ఎన్నికల అబ్జర్వర్ శ్రీనివాస రాజు
గద్వాల, వెలుగు: కొత్త ఓట్లు, మార్పులు చేర్పులను ఎలాంటి తప్పులు లేకుండా గరుడా యాప్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ శ్రీనివాసరాజు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో కలెక్టర్ క్రాంతితో కలిసి ఓటర్ నమోదుపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత ఓటర్లకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డును లింక్ చేయాలని సూచించారు. అనంతరం ఎర్రవల్లి చౌరస్తాలోని టెన్త్ బెటాలియన్‌లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.
రోడ్డు బాధితులకు ఇండ్లిస్తం : మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి , వెలుగు: రోడ్ల విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో రూ.2.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు, నాగవరం తండా సమీపంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి కొత్త జిల్లాగా ఏర్పడడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. పట్టణం నలువైపులా వేగంగా విస్తరిస్తోందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 30వ వార్డులో కొత్త పార్క్ ఏర్పాటు చేయిస్తామని, 12 తర్వాత ప్రతి వార్డులో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు రమేశ్ గౌడ్, లక్ష్మయ్య, ఉంగ్లం తిరుమల్ పాల్గొన్నారు.
రామన్న గట్టుతో సాగునీటి సమస్యకు చెక్
పానుగల్, వెలుగు: రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణంతో పానుగల్ మండలంలో సాగునీటి సమస్య తీరుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే
బీరం హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్‌కలిసి పానుగల్ జడ్పీహెచ్‌ఎస్ చెందిన కిరణ్ కుమార్ రచించిన విద్యార్థుల కవితా సంకలనం ‘లెట్ మి ఫ్లై’, ఆకునోనిపల్లికి చెందిన సానేగౌని సుధాకర్ గౌడ్ రచించిన ‘మంచి ముత్యాలు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. పానుగల్ వాసిగా అధునాతన స్కూల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. తర్వలోనే 132 కేవీ సబ్ స్టేషన్ మంజూరు కానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీ చంద్ర శేఖర్ నాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మునీరుద్దిన్, మండల అధ్యక్షుడు రాము యాదవ్, సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ హైమావతి పాల్గొన్నారు.
జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించండి : ప్రజాసంఘాల వినతి
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించాలని ప్రజా సంఘాల నేతలు మంగళవారం స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్‌పర్సన్ పోస్ట్ ఎస్సీ జనరల్రిజర్వ్ కాగా.. తెలకపల్లి జడ్పీటీసీ పెద్దపల్లి పద్మావతి ఆ పదవి చేపట్టారని వివరించారు. సాంకేతిక అంశాల కారణంగా కోర్టు అనర్హురాలిగా ప్రకటించడంతో వైస్ చైర్మన్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన నలుగురు జడ్పీటీసీలు ఉన్నారని, రిజర్వేషన్ ప్రకారం జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించాలని కోరారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, బీఎంపీ, టీపీవైఎస్ నేతలు గూట విజయ్, గడ్డం విజయ్, కూరాకుల శ్రీనివాస్, పడిగె వెంకటేశ్, ఆదిరాల వెంకటయ్య, కె. ఓం ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
రోడ్డు విస్తరణ పేరుతో గుడిలో విగ్రహాలు ధ్వంసం
వనపర్తి, వెలుగు: వనపర్తి కన్యకపరమేశ్వరి ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పేరుతో హిందూదేవతల విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక రాజీవ్ చౌరస్తా వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో మున్సిపాలిటీ నిధులతో చేపడుతున్న రోడ్ల విస్తరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. కానీ, ఇండ్లు, ఆస్తులను కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వకుండా, నాసిరకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. కన్యకా పరమేశ్వరి గుడిలో ఉన్న విగ్రహాలను ఆలయ కమిటీ సభ్యులను బెదిరించి ధ్వంసం చేయడం దారుణమన్నారు. బాధ్యులపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా మంత్రి నిరంజన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బి.కృష్ణ, నారాయణ, రామన్ గౌడ్, సీతారాములు, సుమిత్రమ్మ, కుమారస్వామి, పద్మ, పెద్దిరాజు, బచ్చు రాము, సూగురు రాము పాల్గొన్నారు.
పోలీస్ అభ్యర్థులకు రేపటి నుంచి ఫిజికల్ టెస్ట్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రాత పరీక్షలు ఉత్తీర్ణులైన పోలీస్ అభ్యర్థులకు రేపటి నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి జనవరి 3 వరకు జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పద్ధతి ద్వారా ఈవెంట్స్ ఉంటాయని వెల్లడించారు. జిల్లాలో 23,747 మంది అభ్యర్థులు(19,504 మంది పురుషులు, 4,243 మంది మహిళలు) ఉన్నారని, ప్రతి రోజు ఉదయం 5 గంటల నుండి గ్రౌండ్ లోకి అనుమతిస్తామని చెప్పారు. సీసీ కెమోరాల నిఘా ఉంటుందని, అడ్మిన్ కార్డు,ఇంటిమెషన్ లేటర్, తమ సంతకం కూడిన పార్టు2 అప్లికేషన్ ఫాం వెంట తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ, సైనికోద్యోగి అయితే తన సంతకంతో కూడిన ధ్రువపత్రం ఉండాలన్నారు.అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో రావాలని, అనారోగ్య, ఇతరత్ర కారణాలుంటే తేదీ మార్పు కోసం తగిన ఆధారాలతో 4 రోజుల ముందుగానే పోలీస్ ఆఫీసర్స్ ను సంప్రదించాలని సూచించారు. ఏఎస్పీ ఎ.రాములు, డీఎస్పీలు మహేశ్, శ్రీనివాసులు, లక్ష్మణ్, ఏవో కృష్ణయ్య పాల్గొన్నారు.
పెద్దచెరువు ఆయకట్టుకు నీళ్లియ్యాలె
ధన్వాడ, వెలుగు: ధన్వాడ పెద్దచెరువు కింద తైబంది చేసి యాసంగి పంటకు సాగు నీళ్లు ఇవ్వాలని గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రైతులు మాట్లాడుతూ చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అలాగే పాత రెవిన్యూ కార్యాలయం స్థలంలో రూ.15లక్షలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మించాలని తీర్మానించారు. అనంతరం స్థానిక సర్పంచ్ అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ నాగలక్ష్మీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాధవి, మాజీ కోఆప్షన్ సభ్యులు రహమన్ఖాన్, రైతులు నర్సిములు, భాస్కర్, వెంకట్‌రెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.