పెద్దలు ఒప్పుకోలేదని లవర్స్‌‌ సూసైడ్‌‌

పెద్దలు ఒప్పుకోలేదని లవర్స్‌‌ సూసైడ్‌‌
  • మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కాకర్లపహాడ్‌‌లో ఘటన

నవాబ్‌‌పేట, వెలుగు : తమ ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోగా, యువకుడిని కొట్టడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు సైతం ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా నవాబ్‌‌పేట మండలం కాకర్లపహాడ్‌‌లో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి సుజాత, ఆంజనేయులు కుమార్తె అంకిత (18) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతోంది.

 అదే గ్రామానికి చెందిన చందుకుమార్‌‌ (20) ఓ ప్రైవేట్‌‌ డిగ్రీ కాలేజీలో సెకండ్‌‌ ఇయర్‌‌ చదువుతున్నాడు. వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం అంకిత కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు నాలుగు రోజుల కింద చందుతో గొడవకు దిగి, అతడిని కొట్టారు.

 దీంతో మనస్తాపానికి గురైన అంకిత ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత చూసిన కుటుంబ సభ్యులు జిల్లాకేంద్రంలోని హాస్పిటల్‌‌కు తరలించగా, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని చెప్పారు. 

మరో వైపు చందుకుమార్‌‌ సైతం సోమవారం ఉదయం సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంకిత చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తనను ఏమైనా చేస్తారన్న భయంతో చందు కూడా సూసైడ్‌‌ చేసుకొని ఉంటాడని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై విక్రమ్‌‌ తెలిపారు.