కార్పొరేట్​కు దీటుగా మహబూబ్‌నగర్ హాస్పిటల్‌

  • త్వరలో అందుబాటులోకి
  •  కార్డియాలజీ సహా పలు సూపర్ స్పెషాలిటీ సేవలు: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌‌‌ను కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హాస్పిటల్‌లో ఎంఆర్‌ఐ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సుమారు రూ.10 కోట్లతో ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు చేసి, ఉగాది నుంచి సేవలు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.‌ 

శుక్రవారం హైదరాబాద్‌లోని మెడికల్ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలోని హాస్పిటళ్ల పనితీరు, వైద్యారోగ్య సేవలపై మంత్రి రివ్యూ చేశారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఉన్న 5 మెడికల్ కాలేజీలు, జనరల్ హాస్పిటళ్లు, జిల్లా, ఏరియా హాస్పిటళ్ల అభివృద్ధికి సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్, ఇతర సర్వీసెస్‌కు సంబంధించి పూర్తి వివరాలతో, వేర్వేరుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి‌ సూచించారు. పేషెంట్ లోడ్‌కు అనుగుణంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.  హాస్పిటళ్లలో మెడిసిన్ ఉండేలా చూసుకునే బాధ్యత త్రీమెన్ కమిటీదేనన్నారు‌. ఎక్కడైనా మెడిసిన్ లేవని పేషెంట్లకు ఇబ్బంది కలిగిస్తే కమిటీపై చర్యలుంటాయని హెచ్చరించారు. డాక్టర్లు సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.