- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, వెలుగు : విదేశాల్లో చదువుకున్న కేటీఆర్ కు ఎవరూ సంస్కారం నేర్పనట్టు ఉన్నదని.. అందుకే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నిరక్షరాస్యులు కూడా ఇలాంటి కామెంట్స్ చేయరన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో యెన్నం మీడియాతో మాట్లాడారు. రికార్డింగ్ డ్యాన్సులు ఏపీలో ఉంటాయని, ఆ సంస్కృతి మన రాష్ట్రంలో లేదన్నారు. కేటీఆర్‌కు ఈ విషయం కూడా తెల్వదా? అని యెన్నం ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో
బావ బామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నారు. అందుకే ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలో ఫామ్ హౌస్ లో కూర్చొని ఆలోచిస్తున్నారని చురకలంటించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూసిన ఎవరికైనా బీఆర్ ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ అని అర్థమవుతుందన్నారు. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని యెన్నం చెప్పారు. అమరుల త్యాగాల మీద పదవుల్లోకి వచ్చి గత పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు, వడ్డీ తమ ప్రభుత్వానికి పెద్ద భారంగా మారాయన్నారు. రేవంత్ రెడ్డి సోదరుల గురించి మాట్లాడుతున్న కేటీఆర్ కు సిగ్గుండాలని, ఆయన సోదరులకు రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. హరీశ్‌రావు ప్రతిపక్ష నేత కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని, అది జరగని పని అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.