
గిట్టుబాటు కావడం లేదని గుత్తేదారుల ఆందోళన
పెట్టిన ఖర్చులు కూడా చేతికి రాని పరిస్థితి
వారం రోజులుగా పాలమూరు మార్కెట్‌కు వస్తున్న దిగుబడి
మహబూబ్‌నగర్, వెలుగు:చింత చెట్లను లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్లు ఆగమైతున్నరు. ఈ సారి దిగుబడి లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికితోడు మార్కెట్లో రేట్ లేకపోవడంతో కూలీ కూడా గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్వింటాల్ పై రూ.1,500 తగ్గిన ధర
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు ఏండ్లుగా చింతపండు సేకరిస్తున్నారు. జనవరిలో ఊరూరు తిరిగి.. అక్కడున్న చింత చెట్లను పరిశీలించి, చెట్లకు పట్టిన పూత ఆధారంగా రైతుతో మాట్లాడి గుత్తకు పట్టుకుంటారు. మార్చి చివరి వారం నుంచి చింతపండు సీజన్ ప్రారంభం కాగానే పండును చెట్టు నుంచి రాల్పి మార్కెట్‌కు తరలిస్తారు. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించక చింత చెట్లకు ఆశించిన స్థాయిలో కాయలు పట్టలేదు. కొద్దో గొప్పో వచ్చిన కాయలు అకాల వర్షాలు, ఈదురు గాలులకు నేలరాలిపోయాయి.
ఉన్న పంటను వారం రోజుల నుంచి గుత్తేదారులు మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. అయితే పండు రేటు పడిపోయింది. నిరుడు క్వింటాల్ చింత పండు రూ.9,500 నుంచి రూ.12 వేల వరకు పలుకగా.. ఈసారి క్వింటాల్ రూ.8 వేలకు మించి పలకడం లేదు. ఈ సీజన్లో అగ్రికల్చర్ మార్కెట్ నిర్ణయించిన ధరల ప్రకారం చింతపండుకు గరిష్ట ధర రూ.12,601, మినిమం ధర రూ.5 వేలు, మోడల్ ధర రూ.9,301 వరకు ఉంది.
కానీ, మార్కెట్‌కు పండు తీసుకొస్తున్న కాంట్రాక్టర్లను వ్యాపారులు బోల్తా కొట్టిస్తున్నారు. పండు బాగా లేదని, పులుపు తక్కువగా ఉందని రేటు తగ్గిస్తున్నారు. నిరుడు ఇదే సీజన్లో క్వింటాల్ చింత పండుకు రూ.9,500 నుంచి రూ.12 వేలు ధర ఇచ్చిన వ్యాపారులు.. ప్రస్తుతం రూ.7,500 నుంచి రూ.8 వేలకు మించి ఇవ్వడం లేదు. మహబూబ్‌నగర్ మార్కెట్‌తో పాటు నారాయణపేట మార్కెట్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
ఖర్చులు తడిసి మోపెడు..
చింత చెట్లను పట్టుకున్న వారికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పండ్లను చెట్ల నుంచి రాల్పి.. మార్కెట్‌కు తరలించే వరకు వేలల్లో ఖర్చులు అవుతున్నాయి. పెద్ద చెట్టను గుత్తకు పట్టుకుంటే రూ.5 వేలు, చిన్న చెట్టు అయితే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు రైతుకు చెల్లిస్తున్నారు. పెద్ద చెట్లకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తే.. చిన్న చెట్లకు ఒకటిన్నర క్వింటాల్ నుంచి రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒక చెట్టు నుంచి చింతపండును రాల్చడానికి రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. చింత పండు కొట్టడానికి కూలీలకు 10 కిలోలకు రూ.200 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కు క్వింటాల్‌కు రూ.500 వరకు అవుతున్నాయి.
కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచి..
వ్యాపారుల తీరుతో గుత్తేదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.8 వేల లోపు ధర కట్టించి.. ఆ పండును సమీపంలోని కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరుస్తున్నారు. ఈ సరుకు 8 నెలల వరకు నిల్వ ఉండే అవకాశం ఉండడంతో.. ఆగస్టు నుంచి మార్కెట్లలోకి తీసుకొస్తున్నారు. ఆ టైంలో సప్లయ్ తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఆ టైంలో క్వింటాల్ చింతపండును రూ.15 వేల నుంచి రూ.18 వేలకు విక్రయించి లాభాలు పొందుతున్నారు.
అక్కడ రేట్ లేక ఇక్కడికి వచ్చా..
నారాయణపేట మార్కెట్లో ప్రతి శనివారం మాత్రమే చింతపండును కొంటరు. అక్కడ క్వింటాల్‌కు రూ.7,500 లోపు ధర ఉందని, పాలమూరు మార్కెట్‌కు తెచ్చినా. ఇక్కడా అదే రేటు ఉంది. ఈ ధరలతో మాకు కూలీ కూడా గిట్టుబాటు కాదు. క్వింటాల్‌కు రూ.10 వేలు ఇస్తే కొంత లాభం ఉంటది.- అంజమ్మ, కాంట్రాక్టర్, పులిమామిడి, ఊట్కూరు మండల