మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సదరు యాప్ ప్రమోటర్లలో ఒకరు, యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా దుబాయి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. డాక్యుమెంటేషన్ పూర్తయ్యాక అతన్ని భారత్‌కు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అప్పగింత ప్రక్రియ ప్రారంభమైందని, వారంలోగా చంద్రకర్‌ను దేశానికి తీసుకురావచ్చని భావిస్తున్నారు.
Also Read :- జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
ఏంటి ఈ మహాదేవ్ బెట్టింగ్ స్కామ్..?
గతేడాది ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ED పరిశోధనల ప్రకారం, మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ అనధికారిక ప్లాట్‌ఫామ్. బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లు సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఆటల్లో బెట్టింగ్ నిర్వహిస్తారు. బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తారు. ఈ కేసులో దాదాపు రూ.5 వేలకోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ UAEలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుండి రన్ అవుతుందని ED దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇద్దరు ప్రమోటర్లపై సహా ఇప్పటి వరకు రెండు చార్జ్ షీట్లను దాఖలు చేసింది.