మహా కుంభ మేళా..త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు

యూపీలోని   ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళ ప్రారంభమయ్యింది. జనవరి 13 తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పవిత్ర స్నానం చేయడానికి  త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మంది పవిత్ర స్నానమాచరించారని తెలుస్తోంది.

పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగుతుంది. రాజ స్నానాలు (షాహీ స్నాన్) ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్​రాజ్​కు తరలివచ్చారు. ఈ మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

జనవరి 13న కోటి మంది భక్తులు,14 న మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు మొత్తం మేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు . సంగం (సంగమం)కి వెళ్లే మొత్తం ఏడు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను ఏర్పాటు చేశారు. 2,751 CCTV కెమెరాలతో పాటు, మేళా పోలీసులు నిఘాకోసం..  రద్దీని నిర్వహించడానికి AI-  టెక్నాలజీ అనలిటిక్స్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. మేళా ప్రాంతంలో.. చుట్టుపక్కల పారామిలటరీ బలగాలు, సుమారు 40,000 మంది పోలీసులను మోహరించారని  ఐజి (ప్రయాగ్‌రాజ్ రేంజ్) ప్రేమ్ గౌతమ్‌ తెలిపారు. 24/7 నిఘా  కోసం 20 హైటెక్ డ్రోన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Also Read :- అక్కమహాదేవి గుహలకు.. నేటి నుంచి ట్రెక్కింగ్, సఫారీ సేవలు

మహాకుంభ మేళా ఏరియాను 25 సెక్టార్లుగా డివైడ్ చేశారు. రాజ స్నానాలు ఆచరించేందుకు ఘాట్లను కూడా 12 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేశారు. 4,500 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే, రోడ్డు మార్గాలను మెరుగుపర్చింది. 67వేల స్ట్రీట్ లైట్లు, 1.50లక్షల టాయిలెట్లు, 25వేల బెడ్లు ఏర్పాటు చేశారు. 50 నుంచి 60 దేశాల భక్తులు ప్రయాగ్ రాజ్ రానున్నారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. సాధారణంగా 6 ఏండ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను.. 12 ఏండ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తుంటారని పండితులు తెలిపారు. కానీ.. ఈ మహాకుంభ మేళాను మాత్రం 144 ఏండ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారని, అందుకే ఇది ఎంతో ప్రత్యేకమని వివరించారు.