కుంభ మేళాలో 14 కోట్ల మంది పుణ్యస్నానాలు

కుంభ మేళాలో 14 కోట్ల మంది పుణ్యస్నానాలు
  • కుటుంబంతో సహా అమిత్ షా పుణ్య స్నానం          
  • అక్షయవట్, బడే హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహా కుంభ మేళాలో సోమవారం ఒక్కరోజే సుమారు 90 లక్షల మంది భక్తులు పుణ్య స్నానం చేశారు. ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటి వరకు 14 కోట్ల మంది స్నానాలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంతో కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో ఆరైల్ ఘాట్​కు చేరుకున్న ఆయనకు సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి షా ఫ్యామిలీ నేరుగా త్రివేణి సంగమానికి చేరుకుంది. భార్య సోనాల్, కొడుకు జై షా, కోడలు రిషిత, మనవలతో కలిసి అమిత్​ షా ప్రత్యేక పూజలు చేశారు. గంగామాతకు హారతి ఇచ్చారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. జునా పీఠాధీశ్వర్ ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద్ గిరి మహరాజ్​తో కలిసి నీళ్లలో దిగిన అమిత్ షా.. గంగామాతతో పాటు సూర్య భగవానుడికి జల సమర్పణ చేశారు. అనంతరం నీళ్లలో మునకలు వేశారు. సాధువులంతా కలిసి షా ఫ్యామిలీని ఆశీర్వదించారు. అమిత్ షా వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రాందేవ్​బాబా, పలువురు సాధువులు ఉన్నారు.

పలు ఆలయాల్లో అమిత్ షా ప్రత్యేక పూజలు

పుణ్య స్నానమాచరించిన తర్వాత అమిత్ షా కుటుంబ సభ్యులంతా అక్షయవాట్ ఆలయాన్ని సందర్శించారు. భార్య సోనాల్, కొడుకు అమిత్ షా, కోడలు రిష్టిత, మనువలు, మవనరాళ్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి బడే హనుమాన్ జీ ఆలయాన్ని సందర్శించారు. జునా అఖాడాను సందర్శించి అఖాడా మహరాజ్, ఇతర అఖాడా సాధువులతో భేటీ అయ్యారు. అనంతరం గురు శరణానంద్ జీ ఆశ్రమాన్ని సందర్శించి గురు శరణానంద్, గోవింద్ గిరి జీ మహరాజ్‌‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత శృంగేరి, పూరి, శంకరాచార్యులతో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీ వెళ్లిపోయారు. అమిత్ షా రాక నేపథ్యంలో త్రివేణి సంగమంతో పాటు ప్రయాగ్​రాజ్​లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మేళా ఏరియాలో నో వెహికల్ జోన్​ను కఠినంగా అమలు చేశారు. కాగా, నాసాకు చెందిన ఆస్ట్రోనాట్.. మహాకుంభ మేళాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.