త్రివేణి సంగమంలో 45 రోజుల ఆధ్యాత్మిక పండుగ.. 144 ఏండ్లకోసారి మహా కుంభమేళా

  • నేటి నుంచి మహాకుంభ మేళా షురూ.. 35 కోట్ల మంది వచ్చే చాన్స్
  •  ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రితో ముగింపు
  • 10వేల ఎకరాల్లో విస్తరణ.. రూ.7వేల కోట్లు ఖర్చు

ప్రయాగ్​రాజ్ (యూపీ):  గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్​రాజ్.. మహా కుంభ మేళాకు సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభంకానున్నది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభమేళా.. 45 రోజుల పాటు కొనసాగుతుంది. రాజ స్నానాలు (షాహీ స్నాన్) ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్​రాజ్​కు తరలివచ్చారు. ఈ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఫిబ్రవరి 26వ తేదీన వచ్చే మహా శివరాత్రితో ఈ మహా కుంభమేళా ముగుస్తుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. సాధారణంగా 6 ఏండ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను.. 12 ఏండ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తుంటారని పండితులు తెలిపారు. కానీ.. ఈ మహాకుంభ మేళాను మాత్రం 144 ఏండ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారని, అందుకే ఇది ఎంతో ప్రత్యేకమని వివరించారు. దేశం మొత్తంలో ప్రయాగ్​రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్​లోనే కుంభమేళా ఏర్పాటు చేస్తారని తెలిపారు. మహా కుంభమేళా మాత్రం కేవలం ప్రయాగ్​రాజ్​లోనే నిర్వహిస్తారని చెప్పారు.

రాజ స్నానాలకు 6 రోజులు ఎంతో కీలకం

ఈ నెల 29న మౌని అమావాస్య ఉంది. దీంతో ఈ నెల 25 నుంచి 30 మధ్య సుమారు 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు రాజ స్నానం కోసం ప్రయాగ్​రాజ్​కు వస్తారని సీఎస్ మనోజ్ కుమార్ తెలిపారు. ‘‘గత కుంభమేళాలతో పోలిస్తే.. ఇది శానిటేషన్, సెక్యూరిటీ, డిజిటల్ మహా కుంభమేళా. 2019 కుంభమేళాలో 24 కోట్ల మంది రాజ స్నానాలు ఆచరించారు. ఈసారి 35కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నది’’ అని సీఎస్ వివరించారు.

25 సెక్టార్లుగా డివైడ్

మహాకుంభ మేళా ఏరియాను 25 సెక్టార్లుగా డివైడ్ చేశారు. రాజ స్నానాలు ఆచరించేందుకు ఘాట్లను కూడా 12 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేశారు. 4,500 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే, రోడ్డు మార్గాలను మెరుగుపర్చింది. 67వేల స్ట్రీట్ లైట్లు, 1.50లక్షల టాయిలెట్లు, 25వేల బెడ్లు ఏర్పాటు చేశారు. 50 నుంచి 60 దేశాల భక్తులు ప్రయాగ్ రాజ్ రానున్నారు.

55 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు

ప్రయాగ్​రాజ్​ను రాష్ట్ర ప్రభుత్వం అందంగా ముస్తాబు చేసింది. త్రివేణి సంగమానికి ఇరువైపులా దాదాపు 10వేల ఎకరాల్లో సౌకర్యాలు కల్పించింది. భక్తుల కోసం ఏఐ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. 50 లక్షల నుంచి కోటి మందితో ‘మహాకుంభ్ నగర్’ అనే ప్రపంచంలోనే అతిపెద్ద టెంపరరీ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 55 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. 45వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు.

భక్తులకు సమాచారాన్ని అందించడానికి 80 వీఎండీ టీవీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ‘1920’ పేరిట హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో పాటు 50 మందితో కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్, మరో 50 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఈ మొత్తం వ్యవస్థను కమాండ్ కంట్రోల్ సెంటర్​తో అటాచ్ చేశారు.

మహా కుంభమేళాకు స్టీవ్ జాబ్స్ భార్య పావెల్

ఆపిల్ కంపెనీ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్.. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్​రాజ్ వస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాశనంద జీ ఈ విషయాన్ని వెల్లడించారు. నిరంజనీ అఖాడాలో ఆమె బస చేస్తారు. మహా కుంభమేళా సందర్భంగా ఆమె తన పేరును ‘కమలా’గా మార్చుకున్నారు. ఆదివారం ఆమె వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు.

బాలికను మహంత్​కు దానం చేసిన పేరెంట్స్

యూపీకి చెందిన 13 ఏండ్ల రేఖ అనే బాలికను ఆమె తల్లిదండ్రులు జునా అఖాడాకు చెందిన మహంత్ కౌశల్ గిరి అనే సాధువుకు దానమిచ్చారు. తమ కూతురిని సన్యాసినిగా మార్చాల ని కోరారు. వారి నుంచి దానం స్వీకరించిన ఆయన.. ఆ బాలికను తమ అఖాడాలో చేర్చుకుని సన్యాసి నిగా మార్చారు.

ఈ విషయం తెలుసుకున్న జునా అఖాడా చీఫ్ స్వామి అవదేశ్వరానంద్ గిరి మహారాజ్.. బాలికను సన్యాసిగా మార్చడం కరెక్ట్ కాదన్నారు. ఇది అఖాడా రూల్స్​కు విరుద్ధమని తెలిపారు. బాలిక రేఖతో పాటు కౌశల్ గిరిని జునా అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.