![మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో ఉచిత బస్సు ఆ రోజు నుంచే..](https://static.v6velugu.com/uploads/2024/07/mahalakshmi-free-bus-scheme-in-ap-to-start-soon_XVObF3R0aJ.jpg)
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్లు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఏపీ సర్కార్. ఆగస్టు 15న విశాఖలో ఈ పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే రోజున అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఏపీ సర్కార్.
జూలై 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు పథకం అమలు దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దాని పైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని సమాచారం. కొత్త బస్సులు తీసుకొనే వరకూ పథకం వాయిదా వేయాలనే సూచనలు చేశారు అధికారులు. అయితే, ప్రభుత్వం మాత్రం పథకం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి, అనుకున్న సమయానికి ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.