
- మహాలక్ష్మీ స్కీమ్‌తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం
- 5.10 లక్షల నుంచి 4.80 లక్షలకు తగ్గిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
- సిటీలో ఆర్టీసీ బస్సుల్లో రోజూ12 లక్షల మహిళా ప్రయాణికులు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ స్కీమ్, హైదరాబాద్ మెట్రోపై ప్రభావం చూపుతోంది. ఇదివరకు మహిళలు, స్టూడెంట్స్ ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు. ప్రస్తుతం మహాలక్ష్మీ స్కీమ్ వల్ల ఫ్రీ బస్ కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతేడాది 5 లక్షలకు పైనే ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 5 శాతం వరకు తగ్గినట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. సిటీలో ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల సంఖ్య 12 లక్షలకు చేరింది.
5.10 లక్షల నుంచి 4.80 లక్షలకు తగ్గింది
సిటీలో ట్రాఫిక్ సమస్యలతో ఎక్కువ శాతం ప్రజలు మెట్రోను ఎంచుకునేవారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తులు, యువతులు మెట్రో రైల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపేవారు. మెట్రో ప్రారంభించిన 2017 ఏడాది నుంచి క్రమంగా ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభ దశలోనే రెండు లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో తమ గమ్యస్థానాలకు చేరేవారు. గతేడాది రోజుకు సగటున 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. గతేడాది నవంబర్ లో ఒకే రోజు మెట్రోలో 5.47 లక్షల మంది ప్రయాణించారు.
కానీ గత డిసెంబర్ లో మహాలక్ష్మీ స్కీమ్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం మెట్రోలో రోజూ సగటున సుమారు 4.80 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం సమ్మర్ కావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు మెట్రో అధికారులు చెబుతున్నారు.
సిటీ బస్సుల్లో రోజూ 12 లక్షల మహిళా ప్రయాణికులు
మహాలక్ష్మీ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత సిటీలోని ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. మహిళలంతా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. సిటీలోని ఆర్టీసీ బస్సులు దాదాపు వందశాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయి. ప్రస్తుతం సిటీలో 2800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్ బస్సులు పోను 2500 బస్సులు నడుస్తున్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు ప్రతి రోజు ఆర్టీసీ బస్సుల్లో రోజూ సగటున 15 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 21 లక్షలకు చేరింది. అయితే 21 లక్షల మందిలో దాదాపు 12 లక్షల మంది ప్రయాణికులు మహాలక్ష్మీ స్కీమ్ జీరో టికెట్ ద్వారా ప్రయాణించినవారే కావడం గమనార్హం. ఇటీవలే మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య పదికోట్లను క్రాస్ చేసింది.