భాద్రపదశుక్లపక్షం ( మొదటి 15 రోజులు) శుభకార్యములు, పండుగలకువిశేషమైతే .... కృష్ణపక్షం(చివరి 15 రోజులు) పితృకార్యములకువిశేషంగాచెప్పవచ్చు. భాద్రపదమాసంలో వచ్చే అమావాస్య నే మహాలయ అమావాస్య అంటారు. అమావాస్యలు సంవత్సరమునకు 12 ఉంటాయి , మరి భాద్రపద అమావాస్యకు ఇంత విశిష్టత ఎందుకంటే….
బాద్రపదమాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 14 వరకు ఈ పితృపక్ష దినాలు అని పంచాంగాలు పేర్కొంటున్నాయి. ఇది పితృ దేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృ దేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు.. గతించిన వారంతా పితృ దేవతలుగానే పరిగణిస్తారు. ప్రతి నెలా అమావాస్య నాడు పితృ దేవతలను స్మరించుకొని తర్పణాలు వదలాలి. అయితే, కరోనా మహమ్మారిలాంటి విపత్తుల్లో మరణించినవారో, ఏ తిథినందు చనిపోయారో తెలియని వాళ్లు ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తి పరిచి ఆశీస్సులు పొందిన వారవుతారు. ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు, పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని, వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ALSO READ: వారి అందానికి కారణం అదేనా..
పురాణాలప్రకారం మహాభారతంలోని కర్ణుడి గురించి మనకందరికీ తెలుసు. అతని దాన గుణము గురించిచెప్పడానికి మాటలుసరిపోవు, అందుకే అతనిని దానవీరసూరకర్ణ అంటారు. అలాంటి కర్ణుడు చనిపోయిన తరువాత .. ఇన్ని దానములుచేసిన పుణ్యాత్ముడు కాబట్టి స్వర్గలోకమునకు తీసుకెళ్లడానికి దేవదూతలువచ్చారు. వారితో పాటు కర్ణుడు బయలు దేరాడు. మార్గమధ్యమమున కర్ణుడికి విపరీతమైన దాహం వేసింది.అటుగావస్తున్న వర్షపునీటిని చేతితో పట్టి తాగబోయాడు. అయితే అంతలో ఆ నీరు దోసిలిలోనే బంగారమైపోయింది. ఆశ్చర్యం వేసింది కర్ణుడికి. అలాగే ఆకలి వేసింది.. అటుగా ఉన్న ఫలవృక్షముల దగ్గరకు వెళ్లి పండును కోయగా అది కూడా బంగారు పండుగా మారిపోయింది. అలా మార్గమధ్యమమున ఏది తినడానికి గాని, త్రాగడానికి కానీ వీలులేక ఏదిముట్టుకుంటే అదిబంగారమై పోయింది. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రార్ధించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యారు.
అప్పుడు కర్ణుడు తనభాధను చెప్పగా అప్పుడు సూర్యుడు ఇలా వివరించారు. ఓ దాన వీరసూరకర్ణా.... నీవు చేతికి ఎముక లేకుండా అష్టైశ్వరములతోసహా, కవచ కుండలాలతో సహాఅన్నింటినీ ఎడమచేతితో బాగానే దానం చేసావు. కానీ ఒక్కరోజైనా నీ పితృదేవతలకు తర్పణములుఇచ్చావా.. ఆబ్దికములుపెట్టావా.. అలాగే అన్న సంతర్పణచేసావా.. అని అడిగాడు.
భూలోకంలో మనుషులందరూ పిల్లలను కనడానికి కారణం, వారిచే పితృకార్యములు చేయించుకోవడానికి తద్వారా ముక్తి పొందడానికి ఎదురుచూస్తూ ఉంటారు. అనిచెప్పాడు. అప్పుడు కర్ణుడు చాలా విపరీతమైన భాధపడి దేవలోకం చేరుకోగానే ఇంద్రుడిని ఆశ్రయించాడు. ఓ ఇంద్రదేవా నాతప్పు నేను తెలుసుకున్నాను, నన్ను తక్షణమే భూలోకమునకు పంపించండి. నాపితృ వంశస్థులందరికి తర్పణములు, ఆబ్దికములు నిర్వహించుకుని ప్రశాంతంగా మళ్ళీవస్తాను అనివేడుకొన్నాడు.
స్వర్గం అంటేనే సంతోషం.. అంతే గాని సంతోషంగా లేని వాడు స్వర్గంలో ఉన్న నరకమే అని భావించిన ఇంద్రుడు కర్ణునికి భూ లోకానికి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చాడు. వెంటనే కర్ణుడు భూలోకాన్ని చేరుకున్న రోజు ఈభాద్రపద బహుళపాడ్యమి. ఈ భాద్రపద బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు తర్పణములు, ఆబ్దికములు, అన్న సంతర్పణలు నిర్వహించి మరల స్వర్గలోకమునకు వెళ్ళిపోతాడు. సంతోషంగా స్వర్గమునకు వెళ్లిన వాడికి ఆకలి, దప్పిక ఉండవు. ఆ మహాదేవుని అనుగ్రహంతో సంతోషంగా స్వర్గమునకు వెళ్ళిపోయాడు. అందువలన అప్పటినుండి ఈపదిహేను రోజులు పితృపక్షంగా, మహాలయపక్షంగా నిర్వహిస్తారు. అందుకే ఎంత దానధర్మములు చేసినప్పటికీ పితృతర్పణములు, పితృ కార్యక్రమములు చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి సుఖసంతోషములు ఏర్పడతాయి.
అయితే ఇంకొక సందేహం రావచ్చుమీకు ….
మేము ప్రతీ సంవత్సరం మామాతృదేవతలకు, పితృదేవతలకు ఆబ్దికములు నిర్వహిస్తామండి. మేము ఇంక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడుచేయాలా!! అనేప్రశ్నతలెత్తవచ్చు.. తప్పకుండాపెట్టాలి.
ఎందుకంటే మీరు ఆబ్దికం పెట్టినపుడు తండ్రి, తాతగారు, ముత్తాతగారు మూడు తరాలు మాత్రమే వస్తారు. కానీ ఈమహాలయపక్షంలో తర్పణములు, ఆబ్దికములు పితృవంశములో వారందరికీ, అలాగే గురువర్యులకు, సన్నిహితులతో సహా అందరికిపెట్టవచ్చు. దీని వలన వంశస్థులు అందరు సంతృప్తిచెందుతారు. దీని వలన వంశాభివృద్ధి జరుగుతుంది. వివాహం ఆలస్యం అవ్వడం, సంతానపరమైన దోషములు తొలగుతాయి. గయలో శ్రాద్ధం నిర్వహించినంత ఫలితం సంప్రాప్తిస్తుందనిపెద్దల, పండితులనిర్వచనం.
అందు వలన ఈమహాలయపక్షంలో పితృ కార్యక్రమములు, తర్పణములు చేసుకుని అలా వీలుకాని వారు కనీసం పెద్దవాళ్ళ పేరుతో స్వయంపాకం అయినా ఇచ్చుకుని శక్తీమేరకు దానధర్మములు నిర్వహించి పితృదేవతలను సంతృప్తిపరచి వారి అనుగ్రహమునకు పాత్రులైపుత్ర, పాత్రాభివృద్ధులై సంతోషంగా జీవించండి.
ఎవరికి తర్పణాలు వదలాలి..
- 1. తండ్రి
- 2. తండ్రి తండ్రి
- 3. తండ్రి తాత
- 4. తల్లి
- 5. సాపత్నయ మాతు: ( సవతి తల్లి)
- 6. తల్లి అత్తగారు ( నాయునమ్మ)
- 7. తల్లి అత్తగారి అత్తగారు
- 8. తల్లి తండ్రి
- 9. తల్లి తాత
- 10 తల్లి తాత తండ్రి
- 11.తల్లి తల్లి
- 12.తల్లి నాయినమ్మ
- 13. తల్లి నాయినమ్మ అత్తగారు
- 14.మేనమామ
- 15. మేనత్త
- 16. మేనత్త భర్త
- 17. సోదరి
- 18. తల్లి చెల్లి
- 19. గురువు
- 20. జగద్గురువు ( ఆదిశంకరాచార్యులు)
- 21. కంచి కామకోటి పీఠాధిపతులు ( చంద్రశేఖర సరస్వతి వారు)
గమనిక: పైన తెలిపిన వంశీకులలో మరణించిన వారికి మాత్రమే తర్పణాలు వదలాలి. మరొక విషయమేమిటంటే తల్లి మరణించి ... తండ్రి జీవించి ఉన్నట్లయితే.. అలాంటి వారు తర్పణాలు వదలాలి అనుకుంటే ఒక్క తల్లికి మాత్రమే వదలాలి.